Ananthapuram: అనంతపురంలో మెడికల్ షాపులపై ఆపరేషన్ గరుడ ఆకస్మిక తనిఖీలు!

Ananthapuram: అనంతపురం నగరంలో ఆపరేషన్ గరుడలో భాగంగా ఈగల్ టీమ్, డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్న మందులను గుర్తించారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 12 Nov 2026 12:47 PM IST
Ananthapuram
X

Ananthapuram: అనంతపురంలో మెడికల్ షాపులపై ఆపరేషన్ గరుడ ఆకస్మిక తనిఖీలు!

Ananthapuram: అనంతపురం నగరంలో మెడికల్ షాపులపై ఈగల్ టీమ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఆపరేషన్ గరుడలో భాగంగా రుద్రంపేట బైపాస్ వద్ద ఉన్న హేమంత్ మెడికల్ అండ్ ఫ్యాన్సీ షాపులో సర్ప్రైజ్ చెకింగ్ చేపట్టారు.

ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ ఐపీఎస్ ఆదేశాల మేరకు, జిల్లా ఎస్పీ పి. జగదీష్ సూచనలతో ఈ తనిఖీలు నిర్వహించారు.ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు అందిన సమాచారం ఆధారంగా ఈ చర్యలు చేపట్టారు.ఈగల్ టీమ్ అనంతపురం, నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ మస్తాన్ ఎస్ఐ షేక్షావలి, సిబ్బంది, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సంయుక్తంగా తనిఖీల్లో పాల్గొన్నారు.

ఈ తనిఖీల్లో వైద్యుల చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్ లేకుండానే కొన్ని మందులను విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.ముఖ్యంగా ఎన్‌ఆర్‌ఎక్స్ కేటగిరీకి చెందిన మందులను సైతం సరైన ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించినట్లు వెల్లడైంది. ఈ ఉల్లంఘనలపై డ్రగ్ కంట్రోల్ అధికారులు నిబంధనల ప్రకారం తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.

ఈ సందర్భంగా మెడికల్ షాపుల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా నియంత్రిత మందులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

మత్తు మందుల అక్రమ విక్రయాలు, దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఇటువంటి తనిఖీలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఇక మత్తు మందుల అక్రమ విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే ప్రజలు ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని అధికారులు కోరారు.సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఈగల్ సెల్ అనంతపురం వెల్లడించింది.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM