Anantapur: కూటమి ప్రభుత్వంపై ఏపీ జేఏసీ అమరావతి ఆగ్రహం!

Anantapur: కూటమి ప్రభుత్వంపై భగ్గుమన్న ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగులు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 10 Jun 2026 1:52 PM IST
Anantapur
X

Anantapur: కూటమి ప్రభుత్వంపై ఏపీ జేఏసీ అమరావతి ఆగ్రహం!

Anantapur: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఏపీ జేఏసీ అమరావతి అనంతపురం జిల్లా ఉద్యోగుల సంఘం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం నగరంలోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో జిల్లా అధ్యక్షుడు దివాకర్ మాట్లాడారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మరోసారి ఉద్యమాలకు సమాయత్తం కావాలని, ఇందుకు ఇతర ఉద్యోగ సంఘాలు కూడా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

గత ప్రభుత్వంలో రివర్స్ పీఆర్‌సీ ఇచ్చి ఉద్యోగులను ఇబ్బంది పెట్టారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వస్తే ఐఆర్ (IR) ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా పీఆర్‌సీ, (PRC) ఐఆర్ (IR) కోసం కనీసం కమిషన్ కూడా వేయలేదు.

కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా డీఏలు పెంచుకుంటూ పోతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇవ్వడం లేదు. ఏపీలో ఇప్పటివరకు ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ఐఆర్ ఇస్తూ, పీఆర్‌సీ కమిషన్ కూడా వేశారు. మరి ఏపీలో ఎందుకు ఇవ్వడం లేదు? ఉద్యోగులు బాధపడితే ప్రభుత్వానికి సంతోషమా?"

ఉద్యోగులకు రావాల్సిన అన్ని రకాల బకాయిలను వెంటనే వారి పే స్లిప్‌లలో చూపించాలి. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే పర్మినెంట్ చేయాలి. ప్రభుత్వంలో పొదుపు చర్యల్లో భాగంగా ఐదు రోజుల పని దినాల విధానాన్ని అమలు చేయాలి. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు కూడా 2 ఏళ్ల చైల్డ్ కేర్ లీవులు మంజూరు చేయాలి.

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఏపీ జేఏసీ అమరావతి నేతలు హెచ్చరించారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story