OD Cheruvu: అంగన్‌వాడీ కేంద్రంలో ఆహార కమిషన్ తనిఖీ.. సీడీపీఓకు నోటీసులు!
OD Cheruvu: శ్రీసత్యసాయి జిల్లా ఓ.డి.చెరువులో మోడల్ అంగన్‌వాడీ కేంద్రాన్ని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు ఇ. లక్ష్మీరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
OD Cheruvu: అంగన్‌వాడీ కేంద్రంలో ఆహార కమిషన్ తనిఖీ.. సీడీపీఓకు నోటీసులు!
ఓ.డి చెరువు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ గౌరవ సభ్యులు ఇ. లక్ష్మీరెడ్డి నేడు మోడల్ అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో పిల్లలకు, గర్భిణులకు సరఫరా అవుతున్న పౌష్టికాహార నాణ్యతను, రికార్డులను ఆయన నిశితంగా పరిశీలించారు. ఈ తనిఖీలో కేంద్రం పనితీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన కోడిగుడ్లకు కలరింగ్ (ముద్ర) లేకపోవడాన్ని ఆయన గుర్తించారు.
అంతేకాకుండా, సరఫరా చేస్తున్న కోడిగుడ్ల బరువు, నాణ్యత కూడా ప్రమాణాల ప్రకారం లేవని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పౌష్టికాహార పథకంలో ఇలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని లక్ష్మీరెడ్డి హెచ్చరించారు.
గుడ్ల సరఫరాలో నాణ్యతా ప్రమాణాలు పాటించని వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, లోపాలను వెంటనే సవరించి లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు.
పర్యవేక్షణలో విఫలమైనందుకు గాను ఐసీడీఎస్ సీడీపీఓకు, అలాగే నిబంధనల ప్రకారం నాణ్యమైన కోడిగుడ్లను సరఫరా చేయడంలో విఫలమైన ఎగ్ వెండర్ (సరఫరాదారుడు)కు తక్షణమే షోకాజ్ నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆయన ఆదేశాలు జారీ చేశారు.




