Kadiri: కదిరి కార్మికుల స్థలాల అక్రమాలపై చర్యలు తీసుకోవాలి

Kadiri: కదిరిలో భవన నిర్మాణ కార్మికుల స్థలాల అక్రమాలపై బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట భారీ నిరసన చేపట్టారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 14 July 2026 12:08 PM IST
Kadiri
X

Kadiri: కదిరి కార్మికుల స్థలాల అక్రమాలపై చర్యలు తీసుకోవాలి

Kadiri: కదిరి RDO కార్యాలయం ఎదుట కార్మికులతో కలిసి బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నిరసన.

కదిరి మున్సిపల్ పరిధిలోని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘానికి చెందిన దాదాపు 500 మంది సభ్యులు తమ సొంత నిధులతో కొనుగోలు చేసిన స్థలాల్లో జరిగినట్లు ఆరోపణలు ఉన్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కదిరి RDO కార్యాలయం ఎదుట బీజేపీ నేత్రుత్వంలో ఆందోళన చేపట్టారు.

దాదాపు 300 మంది భవన నిర్మాణ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, సంఘం నాయకులతో కలిసి బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నిరసనలో పాల్గొని, అనంతరం RDOకు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికుల స్థలాల వ్యవహారంలో జరిగిన అక్రమాల కారణంగా దాదాపు 500 మంది భవన నిర్మాణ కార్మికులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని ఆరోపించారు. అంతేకాకుండా, మరణించిన సుమారు 40 మంది కార్మికుల కుటుంబాలకు సంబంధించిన పట్టాలను కూడా కొందరు దళారులు అక్రమంగా కబ్జా చేశారని విమర్శించారు.

గతంలో నిర్వహించిన విచారణలో అక్రమాలు జరిగినట్లు తేలినా, కోందరు నేతల రాజకీయ ఒత్తిళ్లు కారణంగా ఇప్పటివరకు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ పట్టాలు సృష్టించిన వారు, దళారులు, అక్రమాలకు సహకరించిన అధికారులపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసలైన లబ్ధిదారులైన కార్మికులకు స్థలాలు అప్పగించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

కార్మిక సంఘ సభ్యులపై రాజకీయ నాయకుల పేర్లు చెబుతూ అక్రమంగా కేసులు నమోదు చేస్తామని బెదిరించి వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మరణించిన కార్మికుల కుటుంబాల వద్ద కూడా కనీస మానవత్వం లేకుండా వేలాది రూపాయలు వసూలు చేసి, తిరిగి వారి డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. కొందరు రెవెన్యూ అధికారులు కూడా దళారులకు అండగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వినతిపత్రాన్ని స్వీకరించిన RDO ఫిర్యాదులను సమగ్రంగా పరిశీలించి, గత విచారణ నివేదికల ఆధారంగా నిష్పక్షపాత విచారణ నిర్వహించి చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అర్హులైన కార్మికులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని, అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కార్మికులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ వారి పక్షాన పోరాటం కొనసాగిస్తుందని ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు సాతర్ల రామకృష్ణ, బాబు, భాష, నర్సింహులు, బీజేపీ నాయకులు బి. ఉత్తమ్ రెడ్డి, బూదిలి సుదర్శన్, ఆర్.సి. రెడ్డి, డి.ఎల్. ఆంజనేయులు, హరి నాయక్, నాగార్జున, ఇంతియాజ్, నందిశెట్టి బాబు, ఓబుల్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, గణేష్ నాయక్, వెంకట్ రెడ్డి, మహిళా నాయకురాలు నాగేశ్వరి, ఆవుల శీను, కుటాగుల సూరి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story