Dharmavaram: ధర్మవరం మున్సిపల్ నోటిఫికేషన్‌లో లోపాలు.. బీఎస్పీ నేత

Dharmavaram: ధర్మవరం మున్సిపాలిటీ వార్డుల పునర్విభజన ప్రాథమిక నోటిఫికేషన్‌లో తీవ్ర లోపాలు ఉన్నాయని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు సాకే వినయ్ కుమార్ మండిపడ్డారు.

NAGENDRA, DHARMAVARAM
Published on: 23 May 2026 6:34 PM IST
Dharmavaram
X

Dharmavaram: ధర్మవరం మున్సిపల్ నోటిఫికేషన్‌లో లోపాలు.. బీఎస్పీ నేత

Dharmavaram: ధర్మవరం మున్సిపాలిటీ విడుదల చేసిన వార్డుల పునర్విభజన ప్రాథమిక నోటిఫికేషన్‌లో తీవ్ర లోపాలు, రాజ్యాంగ విరుద్ధ అంశాలు ఉన్నాయని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) జిల్లా అధ్యక్షులు, ధర్మవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ సాకే వినయ్ కుమార్ అన్నారు.ధర్మవరంలో నిర్వహించిన ఉమ్మడి ప్రజా సంఘాల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వార్డుల వారీ జనాభా పట్టికను బహిర్గతం చేయకుండా వార్డుల సరిహద్దులు నిర్ణయించడం వల్ల ఎస్సీ, బీసీ రిజర్వేషన్లకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు.

ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల సంఖ్యను 40 నుంచి 48కు పెంచుతున్న నేపథ్యంలో తుంపర్తి కాలనీలో నివసిస్తున్న వేలాది మంది పేద కుటుంబాలను మున్సిపాలిటీలో విలీనం చేయకుండా మినహాయించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వార్డుల వారీ జనాభా పట్టికను విడుదల చేసి, ఎస్సీ మరియు బీసీ రిజర్వేషన్లను చట్టబద్ధంగా అమలు చేయాలని, తుంపర్తి కాలనీని మున్సిపాలిటీ పరిధిలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.

ప్రజల అభ్యంతరాల పరిశీలన కోసం అదనపు గడువు ఇచ్చి బహిరంగ ప్రజా విచారణ నిర్వహించాలని కోరారు. ఈ మేరకు ఉమ్మడి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ధర్మవరం మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య కు మున్సిపల్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. అలాగే తదుపరి పరిపాలనా చర్యల కోసం ఆ వినతిపత్రం ప్రతిని ధర్మవరం ఆర్డీఓ కార్యాలయంలో కూడా సమర్పించారు.

ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర నాయకులు కేసగల్ల వెంకటేష్, ఆమ్ ఆద్మీ ఇన్‌చార్జ్ కుమ్మర హరికృష్ణ, ఆర్‌ఎస్‌పీ పార్టీ రాష్ట్ర నాయకుడు మంజుల నరేంద్ర, ఎస్సీ జన సంఘం ఆంధ్ర–కర్ణాటక స్టేట్ ఇన్‌చార్జ్ సాకే కుళ్లాయప్ప, బీఎస్పీ నాయకులు రాచర్ల నారాయణస్వామి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.అధికారులు ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా తుది నోటిఫికేషన్ విడుదల చేస్తే ప్రజా ఉద్యమాలతో పాటు చట్టపరమైన పోరాటం కూడా చేపడతామని నాయకులు హెచ్చరించారు.

NAGENDRA, DHARMAVARAM

NAGENDRA, DHARMAVARAM

Next Story