chennekothapalli: ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట భాస్కర్ ఆటలు సాగలేదు!

chennekothapalli: సి.కే.పల్లిలో సెక్యూరిటీ బాండ్ నిబంధనలను ఉల్లంఘించి సొమ్ము చెల్లించని నిందితుడు చేలూరు భాస్కర్‌కు మేజిస్ట్రేట్ 15 రోజుల జైలు శిక్ష విధించారు.

SHAIKH FIROZ, PUTTAPARTHI
Updated on: 20 July 2026 11:56 PM IST
chennekothapalli
X

chennekothapalli: ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట భాస్కర్ ఆటలు సాగలేదు!

చెన్నేకొత్తపల్లి: సెక్యూరిటీ బాండ్ నిబంధనలను ఉల్లంఘించి, బాండ్ సొమ్ము చెల్లించని వ్యక్తికి 15 రోజుల జైలు శిక్ష విధించినట్లు సి.కే.పల్లి సీఐ మహమ్మద్ అలీ, ఎస్సై సత్యనారాయణ తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం.. సి.కే.పల్లి మండలం న్యామద్దల గ్రామానికి చెందిన చేలూరు భాస్కర్, చేలూరు కిష్టప్పలపై 2022 డిసెంబర్ 22న మోటార్‌సైకిల్‌పై 40 ప్యాకెట్ల కర్ణాటక మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై Cr.No.233/2022, సెక్షన్ 34(A) ఏపీ ఎక్సైజ్ చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచారు.

అనంతరం 2026 ఫిబ్రవరి 6న మంచి ప్రవర్తన కోసం ఇద్దరినీ సి.కే.పల్లి మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (MEM) ఎదుట హాజరుపరచగా, ఒక్కొక్కరిపై రూ.1 లక్ష విలువైన సెక్యూరిటీ బాండ్ తీసుకుని విడుదల చేశారు.

అయితే బాండ్ అమలులో ఉన్న సమయంలోనే, ఫిబ్రవరి 11న న్యామద్దల గ్రామంలోని రాములగుడి వద్ద భాస్కర్, నరేష్ అనే వ్యక్తితో గొడవకు పాల్పడ్డాడు. దీంతో Cr.No.24/2026, సెక్షన్ 292 బీఎన్‌ఎస్ కింద మరో కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడు నేరాన్ని అంగీకరించి ధర్మవరం కోర్టులో జరిమానా చెల్లించాడు.

దీంతో సెక్యూరిటీ బాండ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించిన పోలీసులు ఈ విషయాన్ని మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లారు. పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ భాస్కర్ బాండ్ సొమ్ము చెల్లించకపోవడంతో, జూలై 20న మరోసారి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.

బాండ్ సొమ్ము చెల్లించడంలో విఫలమైనందున జూలై 20 నుంచి ఆగస్టు 3 వరకు 15 రోజుల జైలు శిక్ష విధిస్తూ మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు నిందితుడిని ధర్మవరం సబ్‌జైలుకు తరలించినట్లు సీఐ తెలిపారు.

సెక్యూరిటీ బాండ్ నిబంధనలను ఉల్లంఘించినా, బాండ్ సొమ్ము చెల్లించడంలో నిర్లక్ష్యం వహించినా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని సీఐ మహమ్మద్ అలీ హెచ్చరించారు.

SHAIKH FIROZ, PUTTAPARTHI

SHAIKH FIROZ, PUTTAPARTHI

Next Story