Palakonda: ఎన్నికల విధులపై సిబ్బందికి అవగాహన ఉండాలి: కలెక్టర్!

Palakonda: పాలకొండ, భామిని, సీతంపేట, వీరఘట్టం మండలాల్లో ఆదివారం జరిగే రెండో విడత పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ప్రభాకర రెడ్డి ఆదేశించారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 28 Nov 2026 4:44 PM IST
Palakonda
X

Palakonda: ఎన్నికల విధులపై సిబ్బందికి అవగాహన ఉండాలి: కలెక్టర్! 

Palakonda: పాలకొండ నవంబర్ 29వ తేదీ ఆదివారం పాలకొండ, భామిని, సీతంపేట, వీరఘట్టం మండలాల్లో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ మరియు కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో సిబ్బంది తమ విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. ఎన్. ప్రభాకర రెడ్డి సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ పోలింగ్ మరియు కౌంటింగ్ ప్రక్రియను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. సిబ్బంది నిర్ణీత సమయానికి ముందుగానే తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఎన్నికల విధులకు సిద్ధంగా ఉండాలని, పోలింగ్ ప్రారంభానికి ముందు ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ పత్రాలు, ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని తెలిపారు.

ఓటు వేయడానికి వచ్చే ప్రతి ఓటరు గుర్తింపును, ఓటర్ల జాబితాలో పేరును నిబంధనల ప్రకారం ధ్రువీకరించాలని, ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో ఓటర్లకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. వృద్ధులు, దివ్యాంగ ఓటర్లకు ఎన్నికల నిబంధనల ప్రకారం సహాయం చేయాలని, పోలింగ్ కేంద్రంలో ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించాలని తెలిపారు. పోలింగ్ మరియు కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్ వివరాలను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు తెలియజేయాలని పేర్కొన్నారు. అదే విధంగా పోలింగ్ సిబ్బంది ఏ రాజకీయ పార్టీకి లేదా అభ్యర్థికి అనుకూలంగా, వ్యతిరేకంగా వ్యవహరించరాదని, ఓటర్లను ప్రభావితం చేసేలా మాట్లాడటం, ఒత్తిడి చేయడం, ఓటు రహస్యాన్ని వెల్లడించడం వంటి చర్యలకు పాల్పడరాదని స్పష్టం చేశారు.

అనధికార వ్యక్తులను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించరాదని, ఎన్నికల కేంద్రాల్లో రాజకీయ ప్రచారం, పార్టీ గుర్తుల ప్రదర్శనకు అవకాశం ఇవ్వకూడదని సూచించారు. ఎన్నికల సామగ్రిని నిర్లక్ష్యంగా నిర్వహించడం, అనుమతి లేకుండా విధుల నుంచి బయటకు వెళ్లడం, ఎన్నికలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని అనధికార వ్యక్తులతో పంచుకోవడం చేయరాదన్నారు. పోలింగ్ మరియు కౌంటింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ పత్రాలు, ఎన్నికల రికార్డులను ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం భద్రపరిచి సంబంధిత అధికారులకు అప్పగించాలని తెలిపారు. ఎన్నికల విధుల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా, సమన్వయంతో పనిచేసి రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి సూచించారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA