Puttaparthi: అంగన్‌వాడీలపై కలెక్టర్ కన్నెర్ర: వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు!
Puttaparthi: శ్రీ సత్యసాయి జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల పనితీరుపై కలెక్టర్ సమీక్ష.
Puttaparthi: అంగన్‌వాడీలపై కలెక్టర్ కన్నెర్ర: వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు!
పుట్టపర్తి: కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ నందు శ్రీ సత్యసాయి జిల్లాలో సమగ్ర శిశు అభివృద్ధి సేవల (ICDS) పథకం అమలు, అంగన్‌వాడీ కేంద్రాల పనితీరుపై కలెక్టరేట్ నుండి కలెక్టర్ సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు అంగన్‌వాడీ కేంద్రాల్లో వంద శాతం ప్రగతి సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలోని 2,824 అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఫేషియల్ రికగ్నిషన్ ఇ-కేవైసీ (ఫేస్ క్యాప్చర్) ప్రక్రియ ప్రస్తుతం 86.45% నమోదైందని, మిగిలిన శాతాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. గుడిబండ, పుట్టపర్తి, హిందూపురం ప్రాజెక్టుల పరిధిలో ఇ-కేవైసీ ప్రగతిని మరింత మెరుగుపరచాలన్నారు.
ప్రధానమంత్రి మాతృ వందన యోజన (PMMVY) కింద సీడీపీఓ (CDPO) మరియు సూపర్‌వైజర్ల స్థాయిలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 754 దరఖాస్తులు ధర్మవరం (256), ఓబులదేవరచెరువు (246) ప్రాజెక్టులలో అత్యధిక పెండెన్సీ ఉందని, వీటన్నింటినీ తక్షణమే క్లియర్ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలలో విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్ల వసతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. జిల్లాలో ఇంకా విద్యుత్ కనెక్షన్ లేని 137 కేంద్రాలకు, ఫంక్షనల్ టాయిలెట్స్ లేని 411 కేంద్రాలకు (ముఖ్యంగా మడకశిరలో 78, సోమందేపల్లిలో 52) తక్షణమే వసతులు కల్పించాలని ఆదేశించారు.
మే-2026 నెలకు సంబంధించి టేక్ హోమ్ రేషన్ (THR) పంపిణీ మరియు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) పనితీరును సమీక్షించారు. మడకశిర ప్రాజెక్ట్ పరిధిలో పంపిణీ శాతం తక్కువగా (81.5%) ఉన్నందున పర్యవేక్షణ పెంచాలన్నారు. ప్రజల నుండి ప్రతికూల స్పందన (Negative Response) వచ్చిన అంగన్‌వాడీ కేంద్రాలను సంబంధిత సీడీపీఓలు తప్పనిసరిగా సందర్శించాలని కలెక్టర్ ఆదేశించారు. కదిరి, బత్తలపల్లి, సోమందేపల్లి, రొద్దం, మడకశిర, సి.కె.పల్లి ప్రాజెక్టుల పరిధిలోని నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చిన కేంద్రాలకు అధికారులు జీపీఎస్ లొకేషన్ ఫోటోలతో సహా హోమ్ విజిట్స్ చేసి, అక్కడి సమస్యలను పరిష్కరించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.
చిన్నారుల ఆరోగ్య సూచికలు (Stunting, Wasting, Underweight) మెరుగుపరచడానికి క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్ పిడి ప్రమీల,ఐసీడీఎస్ అధికారులు, సీడీపీఓలు, సూపర్ వైజర్లు పాల్గొన్నారు.




