Puttaparthi: ఎల్ నీనో పరిస్థితుల్లో రైతులకు ప్రభుత్వం అండ: కలెక్టర్!

Puttaparthi: ఎల్ నీనో, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పుట్టపర్తిలో సమీక్ష నిర్వహించారు.

SHAIKH FIROZ, PUTTAPARTHI
Published on: 22 Aug 2026 5:21 PM IST
Puttaparthi
X

Puttaparthi: ఎల్ నీనో పరిస్థితుల్లో రైతులకు ప్రభుత్వం అండ: కలెక్టర్!

పుట్టపర్తి: ఎల్ నీనో దృష్ట్యా రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం మరింత అండగా ఉందని రక్షకతడులు ప్రత్యామ్నాయ సాగుపై రైతులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ రైతులకు సూచించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు మరియు ఎల్ నీనో (El Niño) ప్రభావం చూపుతున్న వేళ రైతాంగాన్ని సన్నాహక పరిచేందుకు పుట్టపర్తి లోని సాయి ఆరామం ప్రాంగణంలో "ఎల్ నీనో పై కార్యాచరణ సమీక్ష సమావేశం" నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు సాధారణ సాగు విస్తీర్ణంలో 45 శాతం మాత్రమే పంటలు సాగయ్యాయని, ప్రతికూల వాతావరణం వల్ల 57 శాతం వరకు లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. ఇటువంటి క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటూ వ్యవసాయ, ఉద్యానవన పంటల్లో అద్భుతమైన దిగుబడులు సాధిస్తున్న జిల్లా రైతుల శ్రమను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

ప్రస్తుత తీవ్ర వర్షాభావ పరిస్థితులలో పైరుకి ఏ మోతాదులో నీరు అవసరమో, అంత మాత్రమే అందిస్తూ నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచించారు. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు జిల్లాలోని అర్హులైన ప్రతి రైతును ఇప్పటికే పంటల బీమా (Crop Insurance) పరిధిలోకి ఎన్రోల్ చేయడం జరిగిందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో వర్షం కురిస్తే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేందుకు వీలుగా 80 శాతం రాయితీపై పంపిణీ చేయడానికి 16,000 క్వింటాల విత్తనాల కోటాను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు.

జిల్లాలో పశుగ్రాసం కొరత తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా 1,000 ఎకరాల విస్తీర్ణంలో సామూహిక పశుగ్రాసం పెంచేందుకు సమగ్ర చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.జిల్లాలో ఇప్పటికే 94,000 ఎకరాల్లో PMDS (ప్రకృతి వ్యవసాయ పద్ధతులు) ద్వారా వివిధ రకాల పంటలు సాగు చేస్తూ ఆశించిన ఉత్తమ ఫలితాలు సాధించామన్నారు. ఈ విజయవంతమైన మోడల్‌ను జిల్లాలో 2 లక్షల ఎకరాలకు విస్తరించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు

.కురిసే ప్రతి వర్షపు చుక్కనూ వడిసిపట్టుకోవడానికి రైతులు తమ పొలాల్లో ఖచ్చితంగా 'పొలం కుంటలు' తవ్వుకోవాలన్నారు. వర్షాభావ సమయంలో ఇవి పంటలకు అత్యంత కీలకమైన "రక్షక తడి" అందించేందుకు సహాయపడతాయని వివరించారు.బోర్ వెల్ సౌకర్యం ఉన్న ప్రతి రైతు ఖచ్చితంగా డ్రిప్ / బిందు సేద్య పరికరాలను ఉపయోగించి నీటి వృథాను అరికట్టాలన్నారు.సమావేశ ప్రాంగణంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు నూతనంగా అభివృద్ధి చేసిన "మట్టి నమూనా పరీక్ష కిట్" పనితీరును స్వయంగా రైతుల ఎదుట ప్రత్యక్షంగా ప్రదర్శించి చూపించారు.

అంతేకాకుండా, నూనె గింజల పరిశోధన స్థానం వారు నూతనంగా రూపకల్పన చేసిన ఆముదం విత్తనాలను ప్రయోగాత్మకంగా సాగు చేయడం కోసం ఎంపిక చేసిన కొందరు రైతులకు పంపిణీ చేశారు. ఇదే వేదికపై, జిల్లాలో ప్రకృతి వ్యవసాయంలోనూ, అత్యుత్తమ సేద్యపు పద్ధతుల్లోనూ ఆదర్శంగా నిలిచిన పలువురు ప్రగతిశీల రైతులను కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఘనంగా సన్మానించారు. ఈ సమీక్షా సమావేశం మరియు వర్క్‌షాప్‌లో NAARM శాస్త్రవేత్తలు రమేష్ నాయక్, సురేష్ కుమార్,జిల్లా వ్యవసాయ అధికారి కృష్ణయ్య, డిఆర్‌డిఎ పిడి నరసయ్య,

డిడబ్ల్యుఎంఏ పిడి విజయకుమార్,ఏపిఎంఐపి పిడి దేవానంద,పట్టు పరిశ్రమ శాఖ అధికారిణి శోభారాణి,జిల్లా మార్కెటింగ్ అధికారి హాఫిజుల్లా, వ్యవసాయ శాస్త్రవేత్తలు భాస్కర్ రెడ్డి, చంద్రాయుడు, రామసుబ్బయ్య; జిల్లాలోని సహాయ వ్యవసాయ సంచాలకులు (ADA), వ్యవసాయ అధికారులు (AO), సహాయ అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల (NGO) ప్రతినిధులు, FPO ప్రతినిధులు, జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

SHAIKH FIROZ, PUTTAPARTHI

SHAIKH FIROZ, PUTTAPARTHI

Next Story