Puttaparthi: ఖరీఫ్ సాగు, విత్తనాల పంపిణీపై కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సమీక్ష
Puttaparthi: పుట్టపర్తి జిల్లాలో ఖరీఫ్ సాగు, ఎరువుల లభ్యతపై కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సమీక్ష. రైతులకు సకాలంలో వేరుశనగ విత్తనాలు అందించాలని అధికారులకు ఆదేశం.
Puttaparthi: ఖరీఫ్ సాగు, విత్తనాల పంపిణీపై కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సమీక్ష
పుట్టపర్తి: పంటల మార్పిడి, సహజసిద్ధ వ్యవసాయంపై రైతుల్లో అవగాహన పెంచాలని, వేరుశనగ ఇతర ప్రత్యామ్నాయ పంటల విత్తనాల పంపిణీ వేగవంతం చేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఖరీఫ్-2026 సాగు ప్రణాళికలు, ఎరువులు-విత్తనాల లభ్యత, ఎల్ నినో ప్రభావంపై ముందస్తు సన్నద్ధతపై వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ సమర్పించిన సమగ్ర నివేదికలు, కార్యాచరణ ప్రణాళికలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఖరీఫ్ సాగుకు, ముఖ్యంగా ప్రాథమిక భూమి దుక్కుల తయారీ, సకాలంలో విత్తనాలు చల్లుకోవడానికి ఎంతో అనుకూలంగా ఉన్నాయన్నారు. ఖరీఫ్-2026 కోసం జిల్లాలో 1,19,414 హెక్టార్ల సాధారణ వైశాల్యానికి గాను 1,00,000 హెక్టార్లలో వేరుశనగ సాగును ప్రతిపాదించడం జరిగింది. దీనికోసం 72,289 క్వింటాళ్ల విత్తనాన్ని సిద్ధం చేయగా, ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల (RSK) ద్వారా అర్హులైన రైతుల నమోదు ప్రక్రియ వేగంగా జరుగుతోందని, ఇప్పటివరకు 41,313 మంది రైతులు నమోదు చేసుకున్నారని తెలిపారు.
సి.కె. పల్లి, గోరంట్ల, ఎన్.పి. కుంట, తలుపుల, అమరాపురం, గుడిబండ, మడకశిర తదితర 7 మండలాల్లో ముందస్తుగా విత్తనాల పొజిషనింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. వేరుశనగతో పాటు కంది, కొర్ర, రాగులు, మినుములు, పెసలు, పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు సకాలంలో అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఒకవేళ వర్షాలు ఆలస్యమైతే ఎదుర్కోవడానికి వ్యవసాయ శాఖ పూర్తి సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో ప్రతి ఆర్.ఎస్.కె పరిధిలో కనీసం 100 ఎకరాల్లో ముందస్తు పొడి విత్తన పద్ధతిని (PMDS) ప్రోత్సహించాలన్నారు. ఈ పద్ధతి ద్వారా ప్రస్తుతం జిల్లాలో నిర్దేశించిన 2 లక్షల ఎకరాల లక్ష్యానికి గాను ఇప్పటికే 65,000 ఎకరాల్లో PMDS, 24,684 ఎకరాల్లో పెల్లెటైజేషన్ పూర్తి కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రతి RSK పరిధిలో 10 చొప్పున ఫార్మ్ పాండ్స్ (పంట సంజీవని గుంతలు) నిర్మించి ఇన్-సిటు నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
వర్షాభావ పరిస్థితులు తలెత్తితే తక్కువ కాలపరిమితి గల పంటలు, ఆరుతడి పంటల సాగు, సూక్ష్మ నీటి పారుదల (మైక్రో ఇరిగేషన్) పద్ధతులపై యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా రైతులకు వారాంతపు సలహాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ మొత్తానికి జిల్లాకు 42,351 మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులు అవసరం కాగా, ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా హోల్‌సేల్, రిటైల్ నెట్‌వర్క్‌లో 19,533 మెట్రిక్ టన్నుల ఎరువులు (యూరియా, డి.ఎ.పి, ఎం.ఓ.పి తదితర) నిల్వలు సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.
జూలై అంతిమ వారం వరకు సరిపడా యూరియా, డి.ఎ.పి నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం ప్రవేశపెట్టిన APAIMS ఆన్‌లైన్ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి రైతుకు సకాలంలో రాయితీ ఎరువులు అందేలా చూడాలని, ఇందుకోసం డివిజన్ల వారీగా ప్రత్యేక హెల్ప్ డెస్క్ టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. భూసార రక్షణ కోసం రసాయన ఎరువుల మితిమీరిన వినియోగాన్ని తగ్గించాలని (యూరియా వినియోగాన్ని హెక్టారుకు 136 కేజీల నుండి 121 కేజీలకు తగ్గించేలా) రైతులకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామ, డివిజన్, జిల్లా స్థాయిల్లో 'ధరిత్రి మాత బచావో అభియాన్' లో భాగంగా పర్యవేక్షణ కమిటీలు తనిఖీలు ముమ్మరం చేయాలని స్పష్టం చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డిఎఒ నారాయణ నాయక్,పిడి డిఆర్‌డిఎ నరసయ్య,జిల్లా స్థాయి వ్యవసాయ అధికారులు, జె.డి.ఎ, ఏ.డి.ఎలు, వివిధ డివిజన్ల వ్యవసాయ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.




