Penukonda: పెనుకొండ మున్సిపాలిటీకి రూ.20 కోట్ల అభివృద్ధి నిధులు!

Penukonda: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో మంత్రి సవిత పర్యటించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరయ్యాయని, కక్ష సాధింపు రాజకీయాలు తమ విధానం కాదని స్పష్టం చేశారు.

K.UDAY BHANU, PENUKONDA
Published on: 16 Sept 2026 5:57 PM IST
Penukonda
X

Penukonda: పెనుకొండ మున్సిపాలిటీకి రూ.20 కోట్ల అభివృద్ధి నిధులు!

పెనుకొండ: నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర చేనేత మరియు బీసీ సంక్షేమ శాఖల మంత్రి, పెనుకొండ నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి సవితమ్మ తెలిపారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడి 26 నెలల కాలంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు.పెనుకొండ మున్సిపాలిటీ లో 17, 18వ వార్డుల్లో మంత్రి సవితమ్మ పర్యటించారు. ఈ సందర్భంగా 35 సంవత్సరాలుగా ఉన్న డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేయడంతో స్థానిక మహిళలు హర్షం వ్యక్తం చేశారు.

అనంతరం పట్టణంలో సీసీ రోడ్లను మంత్రి ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభించడంతో స్థానికులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.ప్రయాణికుల సౌకర్యార్థం అంబేద్కర్ సర్కిల్‌లో సొంత నిధులతో ఏర్పాటు చేసిన నూతన బస్ షెల్టర్‌ను మంత్రి పరిశీలించారు. బస్ షెల్టర్‌ను ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

అనంతరం జూనియర్ కళాశాల మైదానాన్ని మంత్రి పరిశీలించారు. కాలేజీ గ్రౌండ్‌లో ఉన్న సమస్యలు, అభివృద్ధి చేయాల్సిన అంశాలపై అధికారులతో చర్చించారు. విద్యార్థులు, యువతతో పాటు ప్రజలకు ఉపయోగపడేలా మైదానాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన 1,200 కుటుంబాలకు ఇంటి పొజిషన్ పత్రాలు అందించేందుకు చర్యలు చేపట్టామని, స్థలం ఉన్న అర్హులైన కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

పెనుకొండ మున్సిపాలిటీ అభివృద్ధికి ఇప్పటికే ₹20 కోట్ల నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే ఆయా నిధులతో అభివృద్ధి పనులను చేపడతామని మంత్రి సవితమ్మ తెలిపారు. పట్టణంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు రోడ్లు, డ్రైనేజీ తదితర సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని చెప్పారు.

ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.“కేసులు పెట్టడం మా నైజం కాదు.. కక్ష సాధింపు రాజకీయాలు చేయడం మా విధానం కాదు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నాయకులు, అప్పటి మంత్రులు తమ సొంత కార్యకర్తలపైనా కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి.

మేము మాత్రం కక్ష సాధింపు రాజకీయాలకు దూరంగా ఉంటూ అభివృద్ధి, సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తున్నాం” అని మంత్రి సవితమ్మ స్పష్టం చేశారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ హామీల్లో 90 శాతం హామీలను అమలు చేశామని మంత్రి తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు.

మేము చేసిన అభివృద్ధి పనులను ప్రజల ముందుంచి, అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ప్రజలను అడుగుతాం. ప్రజల కోసం చేసిన పనులే మా బలం. ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యం అని మంత్రి సవితమ్మ పేర్కొన్నారు. నియోజకవర్గంలో రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

K.UDAY BHANU, PENUKONDA

K.UDAY BHANU, PENUKONDA