Pamidi: పీజీఆర్ఎస్‌తో సమస్యలకు సత్వర పరిష్కారం: తహశీల్దార్ షర్మిల

Pamidi: పామిడి మండలంలో పీజీఆర్ఎస్ ద్వారా అందిన 976 అర్జీల్లో 855 పరిష్కరించామని, ప్రతి సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని తహశీల్దార్ షర్మిల తెలిపారు.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 19 Sept 2026 4:04 PM IST
Pamidi
X

Pamidi: పీజీఆర్ఎస్‌తో సమస్యలకు సత్వర పరిష్కారం: తహశీల్దార్ షర్మిల

పామిడి: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పామిడి మండలంలో పీజీఆర్ఎస్ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ) ద్వారా అందిన అర్జీలను వేగంగా పరిష్కరిస్తున్నట్లు తహశీల్దార్ షర్మిల తెలిపారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పామిడి మండలంలో మొత్తం 976 పీజీఆర్ఎస్ అర్జీలు అందగా, వాటిలో 855 అర్జీలను పరిష్కరించినట్లు ఆమె వెల్లడించారు. పరిష్కరించిన అర్జీలలో కొన్నింటిపై ఫిర్యాదుదారులు తిరిగి అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సుమారు 20 అర్జీలు రీ-ఓపెన్ చేసి పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మిగిలిన అర్జీలను ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పరిష్కరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

భూ సమస్యలతో పాటు రెవెన్యూ, సంక్షేమం, పౌర సరఫరాలు, ఇతర శాఖలకు సంబంధించిన ప్రజా సమస్యలన్నింటినీ పీజీఆర్ఎస్ ద్వారా స్వీకరిస్తున్నామని తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు పామిడి తహశీల్దార్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

మండల, పట్టణ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ముందుగా మండల స్థాయిలోనే ఫిర్యాదులు నమోదు చేసుకోవాలని సూచించారు. మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను గుంతకల్లు ఆర్డీవో కార్యాలయం, అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రస్తావించే అవకాశం ఉందన్నారు.

ప్రజలు సమయపాలన పాటిస్తూ ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని తహశీల్దార్ షర్మిల కోరారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL