Gandlapenta: మట్టి మాఫియా ఆగడాలు.. పట్టపగలే అక్రమ రవాణా
Gandlapenta: శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలం రెక్కమాను గ్రామంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది.
Gandlapenta: మట్టి మాఫియా ఆగడాలు.. పట్టపగలే అక్రమ రవాణా
Gandlapenta: గాండ్లపెంట మండలంలోని రెక్కమాను గ్రామంలో అనుమతులు లేకుండానే ప్లాట్ల కోసం భారీ స్థాయిలో మట్టి తరలింపు జరుగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత నాలుగు రోజులుగా వెలిచలమల రోడ్డుకు సమీపంలోని కానిగాలకుంట ప్రాంతం నుంచి జెసిబి యంత్రాలతో మట్టిని తవ్వి, ట్రాక్టర్ల ద్వారా రెక్కమాను గ్రామానికి పట్టపగలే తరలిస్తున్నట్లు గ్రామ ప్రజలు రైతులు తెలిపారు.
అక్రమ మట్టి తవ్వకాలు, రవాణా బహిరంగంగానే సాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ బాబురావు ను వివరణ కోరగా, మట్టి తరలింపుకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అక్రమంగా మట్టి తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, వీఆర్వో చంద్రశేఖర్ మట్టి తరలింపును నిలిపివేయాలని సూచించినప్పటికీ, ఆయన వెళ్లిన కొద్దిసేపటికే మళ్లీ తరలింపు కొనసాగిందని గ్రామస్తులు, రైతులు చెబుతున్నారు. అనుమతులు లేకుండానే మట్టి మాఫియా బహిరంగంగా కార్యకలాపాలు కొనసాగించడం పట్ల గ్రామస్తులు, రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఈ అక్రమ మట్టి తవ్వకాల వల్ల గ్రామ పరిసరాల్లో రహదారులు దెబ్బతింటున్నాయని, వ్యవసాయ భూములకు కూడా నష్టం కలుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకొని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు,రైతులు డిమాండ్ చేస్తున్నారు.




