Anantapur: ప్రభుత్వ ఆసుపత్రిలో అమానుషం వీల్‌చైర్ కోసం సెల్‌ఫోన్ తాకట్టు

Anantapur: సుపత్రిలో వృద్ధురాలికి వీల్‌చైర్ ఇచ్చేందుకు సెల్‌ఫోన్ తాకట్టు అడిగిన ఘటనపై డీఎంఈ విష్ణువర్ధన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 1 July 2026 5:54 PM IST
Anantapur
X

Anantapur: ప్రభుత్వ ఆసుపత్రిలో అమానుషం వీల్‌చైర్ కోసం సెల్‌ఫోన్ తాకట్టు

అనంతపురం: ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో మానవత్వం మంటగలిసిందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. రోగులకు ఉచితంగా అందాల్సిన వీల్‌చైర్ కోసం సిబ్బంది సెల్‌ఫోన్ తాకట్టు అడిగారంటూ బాధితులు చేసిన ఫిర్యాదు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై డీఎంఈ విష్ణువర్ధన్ ఆదేశాలతో విచారణ ప్రారంభమైంది.

అనంతపురం ప్రభుత్వ సర్వజనాసుపత్రికి చికిత్స కోసం వచ్చిన వృద్ధురాలు సావిత్రమ్మను ఆసుపత్రి లోపల నుంచి బయట ఆటో వరకు తరలించేందుకు ఆమె భర్త వీల్‌చైర్ ఇవ్వాలని ఆసుపత్రి సిబ్బందిని కోరారు. అయితే వీల్‌చైర్ కావాలంటే ముందుగా సెల్‌ఫోన్ తాకట్టు పెట్టాలని సిబ్బంది డిమాండ్ చేశారని భర్త ఆరోపించారు.

సెల్‌ఫోన్ ఇస్తేనే వీల్‌చైర్ ఇస్తామని చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తమ కూతురు స్వాతి, అదే సమయంలో ఆసుపత్రి తనిఖీలకు వచ్చిన డీఎంఈ విష్ణువర్ధన్‌ను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారు. రోగులకు సేవలు అందించాల్సిన సిబ్బంది ఇలాంటి అమానుషంగా ప్రవర్తించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన డీఎంఈ విష్ణువర్ధన్ వెంటనే స్పందించారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలు వెలికి తీయాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

ఈ ఘటనతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందుతున్న సేవలపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

విచారణలో వాస్తవాలు తేలిన అనంతరం బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story