Kalyanadurgam: కళ్యాణదుర్గంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు!
Kalyanadurgam: ఉపాధ్యాయ దినోత్సవం వేళ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమలినేని సురేంద్రబాబు కీలక వ్యాఖ్యలు. రెండు డీఏలు, 12వ పీఆర్సీ, సరెండర్ లీవ్ బకాయిలపై స్పష్టత.
Kalyanadurgam: కళ్యాణదుర్గంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు!
Kalyanadurgam: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రజావేదికలో నిర్వహించిన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులర్పించారు. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్యే అన్నారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలను ఎమ్మెల్యే అమిలినేని ప్రస్తావించారు. 2024 జూలై 1, 2025 జనవరి 1 నుంచి రావాల్సిన రెండు డీఏలను అక్టోబర్ 1 నుంచి చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
అలాగే 12వ వేతన సవరణ సంఘం (12వ పీఆర్సీ) ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 2022 సంవత్సరానికి సంబంధించిన సరెండర్ లీవ్ బకాయిలను వచ్చే సంక్రాంతి నాటికి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చనున్నాయని ఎమ్మెల్యే అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించేందుకు అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. పాఠశాలలను దేవాలయాలతో సమానంగా భావించాలని, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.




