Gooty: గుత్తిలో 4 చోరీ కేసుల గుట్టురట్టు: రూ.12.50 లక్షల సొత్తు స్వాధీనం, ఒకరి అరెస్ట్

Gooty: గుత్తి పరిధిలో 4 ఇళ్ల చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. నిందితుడు వాసును అరెస్ట్ చేసి రూ.12.50 లక్షల విలువైన బంగారం, రూ.3.45 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 12 Sept 2026 9:44 PM IST
Gooty
X

Gooty: గుత్తిలో 4 చోరీ కేసుల గుట్టురట్టు: రూ.12.50 లక్షల సొత్తు స్వాధీనం, ఒకరి అరెస్ట్

అనంతపురం జిల్లా: గుత్తి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన నాలుగు దొంగతనం కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసులకు సంబంధించి సుమారు రూ.12.50 లక్షల విలువైన దొంగసొత్తును స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల మేరకు.. గుంతకల్లు పట్టణంలోని సత్యనారాయణపేట ఎదురుగా ఉన్న మున్సిపల్ కాలనీలో నివాసం ఉంటున్న నల్లబోతుల వాసు (24) రాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు గుత్తి ఆర్‌ఎస్‌లోని రైల్వే క్వార్టర్స్ వాటర్ ట్యాంక్ వద్ద పోలీసులు వాసును అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.

నిందితుడి వద్ద నుంచి సుమారు 60 గ్రాముల (6 తులాల) బంగారు ఆభరణాలు, రూ.3,45,600 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం దొంగసొత్తు విలువ సుమారు రూ.12.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

నిందితుడు వాసుపై గతంలో అనంతపురం, గుంతకల్లు, కసాపురం పోలీస్ స్టేషన్లలో మొత్తం ఆరు కేసులు ఉన్నాయని, గతంలో జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

అనంతపురం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గుంతకల్లు ఎస్‌డీపీఓ ఏ. శ్రీనివాస్ ఆధ్వర్యంలో గుత్తి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎం. రామారావు, ఎస్‌ఐలు కె. సురేష్, డి. అమీర్ ఖాన్ తమ సిబ్బందితో కలిసి ఈ దాడి నిర్వహించి నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసుల దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL