Gorantla: గోరంట్లలో 'జలాధార' పనులను పరిశీలించిన మంత్రి సవిత
Gorantla: పెనుకొండ నియోజకవర్గంలో రూ.3 కోట్లతో చేపడుతున్న జలాధార పనులను గోరంట్ల మండలం గౌనివారిపల్లిలో మంత్రి సవిత పరిశీలించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Gorantla: గోరంట్లలో 'జలాధార' పనులను పరిశీలించిన మంత్రి సవిత
గోరంట్ల: పెనుకొండ నియోజకవర్గంలో సాగు, తాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి వనరులను సద్వినియోగం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలాధార కార్యక్రమం పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రి శ్రీమతి సవిత తెలిపారు.
గోరంట్ల మండలం గౌనివారిపల్లి పంచాయతీలో జరుగుతున్న జలాధార పనులను బుధవారం మంత్రి సవిత పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత సమయంలో పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా జలాధార పనులు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయని, పెనుకొండ నియోజకవర్గంలో సుమారు రూ.3 కోట్ల వ్యయంతో 43 పనులు చేపట్టామని తెలిపారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించడం, చెరువులు, నీటి వనరులను అభివృద్ధి చేయడం ద్వారా రైతులకు, ప్రజలకు ప్రయోజనం కల్పించడమే జలాధార కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు.
ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. జలాధార పనుల వల్ల భూగర్భ జలమట్టాలు పెరిగి సాగునీటి లభ్యత మెరుగుపడటంతో పాటు రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సవిత సూచించారు. జలాధార పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




