Gummagatta: గుమ్మఘట్టలో పోలీసుల విస్తృత నేర అవగాహన సదస్సు
Gummagatta: గుమ్మఘట్ట మండలంలోని పులకుంట, గౌనికుంట గ్రామాల్లో సైబర్ నేరాలు, నకిలీ లోన్ యాప్లు, మహిళా భద్రతపై రాయదుర్గం గ్రామీణ పోలీసులు విస్తృత అవగాహన కల్పించారు.
Gummagatta: గుమ్మఘట్టలో పోలీసుల విస్తృత నేర అవగాహన సదస్సు
గుమ్మఘట్ట మండలం: రాయదుర్గం రూరల్ సీఐ శ్రీ వెంకటరమణ గారు, గుమ్మఘట్ట ఎస్ఐ శ్రీ జి. చిన్నారాయుడు గారు మరియు సిబ్బంది ఆధ్వర్యంలో గుమ్మఘట్ట మండలంలోని పులకుంట మరియు గౌనికుంట గ్రామాల్లో ప్రజలకు పలు అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు మహిళలపై జరుగుతున్న నేరాలు, సైబర్ నేరాలు, ఉద్యోగాల పేరుతో మోసాలు, నకిలీ లోన్ యాప్లు/లోన్ పేరుతో మోసాలు, లాటరీ మరియు బహుమతుల పేరుతో మోసాలు, బాల్య వివాహాలు మరియు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
మహిళలపై నేరాలు:
మహిళలు, బాలికలపై వేధింపులు, హింస, బెదిరింపులు లేదా ఇతర నేరాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. మహిళలు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.
సైబర్ నేరాలు :
తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్లు, లింకులు, OTPలు, బ్యాంక్ వివరాలు మరియు వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ తెలియజేయవద్దని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 సైబర్ హెల్ప్లైన్కు సమాచారం అందించాలని తెలిపారు.
ఉద్యోగాల పేరుతో మోసాలు:
ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ముందుగా డబ్బులు అడిగే వ్యక్తులను నమ్మవద్దని, ఉద్యోగ ప్రకటనలు మరియు సంస్థల వివరాలను అధికారిక వనరుల ద్వారా నిర్ధారించుకున్న తర్వాతే స్పందించాలని సూచించారు.
నకిలీ లోన్లు:
తక్కువ వడ్డీకి తక్షణమే లోన్ ఇస్తామని చెప్పే నకిలీ యాప్లు, వ్యక్తులు మరియు లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు, OTPలు పంచుకోవద్దని సూచించారు.
లాటరీ/బహుమతుల పేరుతో మోసాలు:
లాటరీలో బహుమతి వచ్చిందని, నగదు లేదా కారు గెలుచుకున్నారని చెప్పి ముందుగా పన్ను, ప్రాసెసింగ్ ఫీజు లేదా ఇతర పేర్లతో డబ్బులు అడిగే మోసగాళ్లను నమ్మవద్దని ప్రజలకు వివరించారు.
బాల్య వివాహాలు :
బాల్య వివాహాలు చట్టవిరుద్ధమని, బాలికలకు విద్య, భద్రత మరియు సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. బాల్య వివాహం జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు:
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రజలు శాంతియుతంగా, స్వేచ్ఛగా మరియు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండి, నేరాల నివారణలో పోలీసులకు సహకరించాలని రాయదుర్గం రూరల్ సీఐ శ్రీ వెంకటరమణ గారు, గుమ్మఘట్ట ఎస్ఐ శ్రీ జి. చిన్నారాయుడు గారు కోరారు.




