Guntakal: ఫీజు బకాయిలు రూ.6,400 కోట్లు విడుదల చేయాలి: పీడీఎస్‌యూ
Guntakal: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.6,400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని, జీవో నెం.77ను రద్దు చేయాలని గుంతకల్లులో పీడీఎస్‌యూ డిమాండ్ చేసింది.
Guntakal: ఫీజు బకాయిలు రూ.6,400 కోట్లు విడుదల చేయాలి: పీడీఎస్‌యూ
గుంతకల్లు: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.6,400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు గుంతకల్లు పట్టణంలోని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ కార్యాలయంలో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పీడీఎస్‌యూ గుంతకల్లు నియోజకవర్గ ఉపాధ్యక్షుడు వై. రాజకుమార్ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం ఒత్తిడి తెస్తుండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులకు ఫీజులు చెల్లించలేదనే కారణంతో సర్టిఫికెట్లు అందక, ఉద్యోగ అవకాశాలను సైతం కోల్పోతున్న పరిస్థితి నెలకొందన్నారు.
ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత, వసతి వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను రూ.3,000కు, కాస్మోటిక్ చార్జీలను రూ.300కు పెంచాలని కోరారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ హాస్టళ్లకు నిధులు కేటాయించి సొంత భవనాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గుంతకల్లు పట్టణంలోని బీసీ హాస్టల్‌కు సొంత భవనం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి భవన నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరారు.
అదేవిధంగా పీజీ విద్యార్థులకు ఇబ్బందికరంగా మారిన జీవో నెం.77ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసి, హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో పీడీఎస్‌యూ గుంతకల్లు పట్టణ ప్రధాన కార్యదర్శి తలారి సాయి, పట్టణ నాయకులు విష్ణు, వెంకటేష్, నిఖిల్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.




