Anantapur: GGHలో ఘోరం.. పసికందును బిల్డింగ్ పైనుంచి విసిరేసిన నానమ్మ!
Anantapur: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఘోరం జరిగింది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడనే కక్షతో రెండు నెలల పసికందును రెండో అంతస్తు నుంచి కిందకు విసిరేసింది ఓ నానమ్మ.
Anantapur: GGHలో ఘోరం.. పసికందును బిల్డింగ్ పైనుంచి విసిరేసిన నానమ్మ!
అనంతపురం: అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (GGH) లో గుండెలను పిండేసే హృదయవిదారక ఘటన వెలుగు చూసింది. రక్తసంబంధం, ప్రేమానురాగాలు మర్చిపోయిన ఒక నానమ్మ సత్యమ్మ... కన్న మనవరాలు అని కూడా చూడకుండా రెండు నెలల పసికందును రెండవ అంతస్తు పైనుంచి కిందకు విసిరేసింది! తీవ్ర గాయాలపాలైన ఆ చిన్నారి ప్రస్తుతం ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది.
సత్యసాయి జిల్లా మామిడాకుల పల్లె కి చెందిన అశోక్ కుమార్, పూజిత దంపతుల రెండు నెలల పాపకు ఆరోగ్యం క్షీణించడంతో, ఈ నెల 27న చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే, అదే రోజు అర్ధరాత్రి వేళ ఆ పసిపాప ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది.
పక్కనే నిద్రపోతున్న చిన్నారి కనిపించకపోవడంతో కంగారుపడిన తల్లి వెంటనే ఆస్పత్రి వైద్యులకు, సిబ్బందికి సమాచారం అందించింది.వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది, పోలీసులు పరిసర ప్రాంతాల్లో గాలించగా... డ్రైనేజీ కాల్వలో తీవ్ర గాయాలతో పడి ఉన్న చిన్నారిని గుర్తించారు. రక్తం మడుగులో ఉన్న పాపను వెంటనే బయటకు తీసి, అత్యవసర విభాగానికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం పాప పరిస్థితి ఇప్పటికీ కొద్దిగా మెరుగు పడుతూ ఉందని సూపర్డెంట్ మల్లేశ్వరి తెలిపారు.
అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అర్ధరాత్రి వేళ పసిపాప డ్రైనేజీలో పడిపోవడంపై కేసు నమోదు చేసిన పోలీసులు లోతైన విచారణ ప్రారంభించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఎవరైనా కావాలనే చేశారా అనే కోణంలో ఆస్పత్రిలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా... దిగ్భ్రాంతికర నిజాలు బయటపడ్డాయి.
పాప సొంత నానమ్మే ఈ ఘోరానికి పాల్పడినట్లు పోలీసులు ఆధారాలతో సహా గుర్తించారు! తన కొడుకు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడన్న కక్షతో, ఆ కోపాన్ని ఈ రెండు నెలల పసికందుపై తీర్చుకుంది. అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో పసిపాపను ఎత్తుకెళ్లి రెండవ అంతస్తు పైనుంచి కిందకు విసిరేసిందని తెలిపారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలైన నానమ్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.




