Rayadurgam: జర్నలిస్టుల అక్రమ అరెస్టును ఖండిస్తూ రాయదుర్గంలో నిరసన!
Rayadurgam: నంద్యాలలో ఐ న్యూస్ జర్నలిస్టుల అక్రమ అరెస్టును ఖండిస్తూ రాయదుర్గం తహశీల్దార్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు, సీపీఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నిరసన.
Rayadurgam: జర్నలిస్టుల అక్రమ అరెస్టును ఖండిస్తూ రాయదుర్గంలో నిరసన!
Rayadurgam: అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం నంద్యాలలో ఐ న్యూస్ ఛానెల్‌లో పనిచేస్తున్న ఇద్దరు జర్నలిస్టులను పోలీసులు ఆదివారం రాత్రి అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ అనంతపురం జిల్లా రాయదుర్గంలో జర్నలిస్టు సంఘాలు, సీపీఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మీడియా స్వేచ్ఛను కాలరాసే ఏ ప్రభుత్వాలూ మనుగడ సాగించిన దాఖలాలు లేవని హెచ్చరించారు. నంద్యాల జిల్లాలో మంత్రుల కుమారులు షాడో మంత్రులుగా వ్యవహరిస్తున్న తీరును ఐ న్యూస్ లోగోట్టు స్టోరీ ద్వారా బట్టబయలు చేయడంతోనే ఈ కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు.
వార్తకు సంబంధించిన లింకులను డిలీట్ చేయాలని మంత్రి కుమారులు తీవ్రంగా బెదిరింపులకు దిగినప్పటికీ, జర్నలిస్టులు వెరుగక నిజం నిలబెట్టే ప్రయత్నం చేశారని తెలిపారు. దీనిని సహించలేక పోలీసులను అడ్డంపెట్టుకుని అర్ధరాత్రి అక్రమ అరెస్టులు చేయించడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.పోలీసులను అడ్డంపెట్టి జర్నలిస్టులను భయపెట్టాలని చూస్తే ఎవరూ భయపడే ప్రసక్తే లేదన్నారు.
అరెస్టు చేసిన ఇద్దరు జర్నలిస్టులను ఎక్కడ ఉంచారో, ఏ పరిస్థితిలో ఉన్నారో ఇంతవరకు కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనూ జర్నలిస్టులను వేధించి, అక్రమ కేసులు పెట్టిన ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే బాటలో నడిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
అక్రమంగా అరెస్టు చేసిన జర్నలిస్టులను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని, లేనిపక్షంలో ప్రజా సంఘాలు, జర్నలిస్టులను కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిరసన అనంతరం జర్నలిస్టులు సిద్దు రామాంజీ విష్ణు భక్త షఫీ మిత్ర తో కలిసి సీపీఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, రైతు విభాగం నాయకులు తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.




