Kadiri: ప్రశాంతంగా వినాయక నిమజ్జనం నిర్వహించాలి
Kadiri: కదిరిలో వినాయక నిమజ్జన ఏర్పాట్లపై ఉత్సవ కమిటీతో ఎస్పీ సతీష్ కుమార్ ప్రత్యేక సమావేశం. శాంతి, సోదరభావంతో నిమజ్జనం జరపాలని పిలుపు.
Kadiri: ప్రశాంతంగా వినాయక నిమజ్జనం నిర్వహించాలి
కదిరి: కదిరిలో ప్రశాంతంగా, సురక్షితంగా వినాయక నిమజ్జనం నిర్వహించాలి. పండుగల సమయంలో హిందువులు, ముస్లింలు పరస్పరం సహకరించుకోవడం అభినందనీయం, శాంతి, సోదరభావం, సమయపాలనకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలి. ఉత్సవ కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, IPS గారు.
సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ఈ నెల 20న జరగనున్న వినాయక నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు చేపట్టిన ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, IPS గారు శుక్రవారం దత్త ఫంక్షన్ హాల్‌లో కదిరి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నిమజ్జన ఏర్పాట్లు, శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, సమయపాలన, సౌండ్ సిస్టమ్ వినియోగం, ప్రజల సహకారం తదితర అంశాలపై కమిటీ సభ్యులకు ఎస్పీ గారు పలు సూచనలు చేశారు.
కదిరిలో వివిధ పండుగల సందర్భంగా హిందూ, ముస్లిం వర్గాలు పరస్పరం సహకరించుకుంటూ శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడం అభినందనీయమని ఎస్పీ గారు పేర్కొన్నారు. ఒకరి పండుగలను మరొకరు గౌరవిస్తూ సంప్రదాయాలను పరస్పరం గౌరవించుకోవడం కదిరి ప్రత్యేకతగా నిలుస్తోందన్నారు. కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలోని మసీదును సందర్శించిన సందర్భంగా కూడా సోదరభావంతో కూడిన సానుకూల వాతావరణాన్ని గమనించినట్లు తెలిపారు. ఈ సంప్రదాయాన్ని ప్రతి ఒక్కరూ కొనసాగించాలని కోరారు.
పండుగల సందర్భంగా భక్తి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తూ, ఇతరులకు ఇబ్బంది కలగకుండా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సౌండ్ సిస్టమ్‌ను నిబంధనలకు అనుగుణంగా, పరిమిత శబ్దంతో వినియోగించాలని తెలిపారు.
నిమజ్జనంలో సమయపాలనకు ప్రాధాన్యత
నిమజ్జన కార్యక్రమంలో సమయపాలన ఎంతో ముఖ్యమని ఎస్పీ గారు తెలిపారు. కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించి, సాయంత్రం 5:30 గంటలలోపు అన్ని విగ్రహాలు నిమజ్జన ప్రాంతానికి చేరుకునేలా ఉత్సవ కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
నిర్ణీత సమయానికి నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటే ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు నిర్వహణతో పాటు ప్రజల భద్రతను సమర్థవంతంగా పర్యవేక్షించవచ్చని తెలిపారు.
భక్తుల భద్రతే పోలీసుల ప్రధాన ప్రాధాన్యత
నిమజ్జన ప్రాంతంలో నాలుగు క్రేన్లు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, లైటింగ్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ గారు తెలిపారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు నిమజ్జన ప్రాంతానికి కొంత దూరంలోనే ప్రజలను నిలిపివేసేలా, నిమజ్జనం చేసే ప్రాంతంలోకి పరిమిత సంఖ్యలో వ్యక్తులను మాత్రమే అనుమతించేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
నీటిలో నిమజ్జనం సందర్భంగా ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ నియంత్రణ చర్యలు ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసమేనని స్పష్టం చేశారు.
పోలీసు–ప్రజల సమన్వయంతోనే విజయవంతమైన నిమజ్జనం
కదిరితో పాటు హిందూపురం, పెనుకొండ, ధర్మవరం, పుట్టపర్తి తదితర ప్రాంతాల్లో కూడా నిమజ్జన కార్యక్రమాలకు పోలీస్ బందోబస్తు నిర్వహించాల్సి ఉందని ఎస్పీ గారు తెలిపారు. పోలీస్ స్టేషన్లలో సిబ్బంది పరిమిత సంఖ్యలో ఉన్నప్పటికీ ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.
పోలీసుల సూచనలు, నిబంధనలు ఎవరికీ ఇబ్బంది కలిగించేందుకు కాదని, నిమజ్జన కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగేందుకు తీసుకుంటున్న ముందస్తు భద్రతా చర్యలని తెలిపారు.
ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులకు సహకరిస్తూ నిబంధనలు పాటించాలని, శాంతి, సోదరభావం, సమయపాలన, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ గారు కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు డీఎస్పీలు శివన్నారాయణ స్వామి, శ్రీనివాసులు, సీఐలు వెంకటేశ్వర్లు, నిరంజన్ రెడ్డి, నాగేంద్ర, లక్ష్మీకాంత్ రెడ్డి, ఆర్టీవో అధికారులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




