Anantapur: రాయదుర్గంలో నిలిచిపోయిన ఆర్ఓబీ పనులకు త్వరలోనే కదలిక!

Anantapur: గత ఏడేళ్లుగా నిలిచిపోయిన కనేకల్లు రోడ్డు రైల్వే వంతెన పనులను పూర్తి చేయాలని ఢిల్లీలో కేంద్ర మంత్రి వి. సోమన్నకు కాలవ శ్రీనివాసులు, ఎంపీలు వినతిపత్రం అందజేశారు.

M. MITHRAM, ANANTAPURURAM
Published on: 11 Aug 2026 9:02 PM IST
Anantapur
X

Anantapur: రాయదుర్గంలో నిలిచిపోయిన ఆర్ఓబీ పనులకు త్వరలోనే కదలిక!

అనంతపురం, ఆగస్టు 11 : రాయదుర్గం పట్టణంలోని కనేకల్లు రహదారిపై గత ఏడేళ్లుగా అర్ధాంతరంగా నిలిచిపోయిన రైల్వే వంతెన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నను జిల్లా ప్రజాప్రతినిధులు కోరారు. ఢిల్లీలోని రైల్‌ భవన్‌లో మంగళవారం మంత్రి కార్యాలయంలో ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, హిందూపురం ఎంపీ బికె.పార్థసారధి కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

రాయదుర్గం పట్టణ పరిధిలోని కనేకల్లు - అనంతపురం ప్రధాన రహదారులపై చేపట్టిన రైల్వే వంతెన నిర్మాణ పనులు గత ఏడేళ్లుగా నిలిచిపోయిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో రాయదుర్గం నుండి అనంతపురం, కనేకల్లు రెండు రైల్వే వంతెనల నిర్మాణ పనులను ప్రారంభించినట్లు ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు గుర్తు చేశారు.

అనంతరం వివిధ కారణాలతో పనులు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. అనంతపురం రహదారిపై నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన పనులను పూర్తి చేసేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అంగీకరించి రూ.46 కోట్లు మంజూరు చేసిందని ప్రజాప్రతినిధులు తెలిపారు. అయితే కనేకల్లు రోడ్డులోని రైల్వే వంతెన నిర్మాణాన్ని రైల్వే శాఖ ఆధ్వర్యంలోనే పూర్తి చేయాల్సి ఉందని వివరించారు.

ముఖ్యంగా బళ్లారి - చిక్‌జాజూరు రైల్వే మార్గం డబ్లింగ్ పనులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో కనేకల్లు రహదారిపై ఉన్న రైల్వే వంతెన నిర్మాణానికి మరింత ప్రాధాన్యత ఏర్పడిందని వారు పేర్కొన్నారు. డబ్లింగ్ పనులు పూర్తయిన తర్వాత రాయదుర్గం–తుమకూరు రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలు, రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఈ వంతెన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని మంత్రికి వివరించారు.

ప్రజాప్రతినిధుల విజ్ఞప్తిపై కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న సానుకూలంగా స్పందించారు. వెంటనే రైల్వే బోర్డు సభ్యులతో పాటు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ వంతెన నిర్మాణాన్ని ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుల జాబితాలో చేర్చి, పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. కేంద్ర మంత్రి సానుకూల స్పందనతో ఏడేళ్లుగా నిలిచిపోయిన కనేకల్లు రైల్వే వంతెన నిర్మాణ పనులకు త్వరలో కదలిక వచ్చే అవకాశం ఉందని ప్రజాప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.

వంతెన పూర్తయితే రాయదుర్గం పట్టణ ప్రజల రాకపోకలకు మెరుగైన సౌకర్యం కలగడంతో పాటు, భవిష్యత్‌లో పెరగనున్న రైల్వే రద్దీకి అనుగుణంగా రహదారి రవాణాకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరనుంది. కల్లూరు వద్ద వున్న రైల్వే అండర్ బ్రిడ్జి లో నిత్యం నీళ్లు నిలిచి ఉంటాయి దీనివల్ల రెండువైపులా రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు, వెంటనే చర్యలు చేపట్టాలని అనంతపురం ఎంపీ మంత్రిని కోరారు.

M. MITHRAM, ANANTAPURURAM

M. MITHRAM, ANANTAPURURAM

Next Story