Rayadurgam: కడప జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్‌తో రాయలసీమ ముఖచిత్రం మారుతుంది

Rayadurgam: కడప జేఎస్‌డబ్ల్యూ ఉక్కు పరిశ్రమతో రాయలసీమ యువతకు ఉపాధి లభిస్తుందని, సీమలో రూ.లక్ష కోట్ల పరిశ్రమలకు సీఎం ప్లాన్ చేశారని వెల్లడించిన ఎమ్మెల్యే కాలవ.

M.MITHRAM CHARKRAVARTHY, RAYADURGAM
Published on: 4 July 2026 8:18 PM IST
Rayadurgam
X

Rayadurgam: కడప జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్‌తో రాయలసీమ ముఖచిత్రం మారుతుంది

రాయదుర్గం: రాయలసీమ అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు ఈ ప్రాంత భవిష్యత్తును పూర్తిగా మార్చేలా ఉన్నాయని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కడపలో జేఎస్‌డబ్ల్యూ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవడం రాయలసీమ పారిశ్రామిక ప్రగతిలో చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందన్నారు.

రాయలసీమను పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు సాగుతున్నారన్నారు. జేఎస్‌డబ్ల్యూ ఉక్కు పరిశ్రమతో వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని, అనుబంధ పరిశ్రమలు కూడా పెద్దఎత్తున ఏర్పడి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు విస్తరించనున్నాయని తెలిపారు.

కేవలం కడప మాత్రమే కాకుండా రాయలసీమలో రూ.లక్ష కోట్లతో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తోందని చెప్పారు. పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన ద్వారా పెట్టుబడులను ఆకర్షించే వాతావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం సృష్టిస్తోందని వివరించారు.

రాయలసీమపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న ప్రత్యేక శ్రద్ధ కారణంగానే ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న పారిశ్రామిక ప్రాజెక్టులు ఇప్పుడు కార్యరూపం దాలుస్తున్నాయన్నారు. 2018లో నాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశారన్నారు. అనంతరం వైసిపి ఐదేళ్లలో ఈ పరిశ్రమపై ఏమాత్రం శ్రద్ధ తీసుకోలేదని, కనీసం ప్రహరీ గోడ నిర్మాణం పనులు కూడా చేపట్టలేదని విమర్శించారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తిరిగి అధికారం చేపట్టాక ఈ ప్రాంత వాసుల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై ఆశలు చిగురించాయన్నారు.

రాయలసీమను కరువు, వలసల ప్రాంతంగా కాకుండా పారిశ్రామిక, ఆర్థిక శక్తిగా నిలబెట్టాలన్న దూరదృష్టితో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో రాయలసీమకు సముచిత స్థానం కల్పించాలన్న చంద్రబాబు సంకల్పానికి ప్రజలంతా అండగా నిలవాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంఛార్జిలు పోరాళ్ల పురుషోత్తం, ఇనాయత్, మాజీ కౌన్సిలర్లు కడ్డీపుడి మహబూబ్ బాషా, బండి భారతి, కురుబ ప్రశాంతి, బుదురు తిప్పేస్వమి, డబ్బిడి శివ,ఆనంద్,కొండాపురం శ్రీనివాసులు, కరెన్న తదితరులు పాల్గొన్నారు.

M.MITHRAM CHARKRAVARTHY, RAYADURGAM

M.MITHRAM CHARKRAVARTHY, RAYADURGAM

Next Story