Kalyandurg: ప్రభుత్వాసుపత్రిలో కలెక్టర్, ఎమ్మెల్యే మెరుపు తనిఖీ!

Kalyandurg: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రిని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

P.Sudhakar, Anantapuram
Published on: 16 Jun 2026 8:59 PM IST
Kalyandurg
X

Kalyandurg: ప్రభుత్వాసుపత్రిలో కలెక్టర్, ఎమ్మెల్యే మెరుపు తనిఖీ!

Kalyandurg: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రిని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్, స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతులు, సిబ్బంది పనితీరును పరిశీలిస్తూ పలు సూచనలు చేశారు.

ముందుగా ఆసుపత్రిలోని గర్భిణుల వార్డు, మహిళల వార్డు, ఔట్ పేషెంట్ విభాగం సహా పలు విభాగాలను సందర్శించిన కలెక్టర్, ఎమ్మెల్యే అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. వైద్య సేవలు సకాలంలోఅందుతున్నాయా, మందుల లభ్యత ఎలా ఉంది, సిబ్బంది స్పందన ఎలా ఉందనే విషయాలపై ఆరా తీశారు. రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బంది హాజరు పట్టికలను పరిశీలించిన అధికారులు కొందరు ఉద్యోగులు ఇన్‌టైమ్ మాత్రమే నమోదు చేసినట్లు గుర్తించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించకుండా పూర్తి స్థాయిలో హాజరు నమోదు చేయాలని సూచిస్తూ హెచ్చరించారు. ప్రభుత్వాసుపత్రుల్లో క్రమశిక్షణతో పాటు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు.ఆసుపత్రి ఆవరణలో పరిశుభ్రతను కూడా కలెక్టర్ పరిశీలించారు. పరిసరాలు శుభ్రంగా నిర్వహిస్తున్న తీరు సంతృప్తికరంగా ఉందని పేర్కొన్నారు. ఇదే స్థాయిలో పరిశుభ్రత కొనసాగించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

అనంతరం ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సౌకర్యాలపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు అవసరమని గుర్తించినట్లు తెలిపారు. రోగులకు అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు త్వరలోనే ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు చేపడతామని వెల్లడించారు.

ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రిలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. రోగుల పట్ల మానవత్వంతో వ్యవహరించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు.

P.Sudhakar, Anantapuram

P.Sudhakar, Anantapuram

Next Story