Kalyandurg: అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ - 21 కిలోల వెండి స్వాధీనం
Kalyandurg: కళ్యాణదుర్గంలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. 21 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన ఎస్పీ పి. జగదీష్.
Kalyandurg: అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ - 21 కిలోల వెండి స్వాధీనం
కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం రూరల్ సర్కిల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి సుమారు రూ.40 లక్షల విలువైన 21 కిలోల వెండి ఆభరణాలు, కరిగించిన వెండి ముద్దలు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ పి. జగదీష్, ఐపీఎస్ మంగళవారం జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
అరెస్టయిన వారిలో అనంతపురానికి చెందిన కురపాటి సాయికుమార్ (27), అనంతపురం రూరల్ మండలం అక్కంపల్లికి చెందిన కనుముక్కల చాంద్ బాషా (29), శ్రీసత్యసాయి జిల్లా పరిగి మండలం కొడిగినెహళ్లికి చెందిన గుండప్పగారి సూదం (32) ఉన్నారు.
పోలీసుల విచారణలో ముఠా నేర శైలి వెలుగులోకి వచ్చింది. తాళం వేసి ఉన్న దేవాలయాలను గుర్తించి, ఎవరూ లేని సమయాల్లో చోరీలకు పాల్పడేవారు. ఆధారాలు లభించకుండా ముఖాలకు మాస్కులు, చేతులకు గ్లౌజులు ధరించేవారు. ఆలయాల్లోని సీసీ కెమెరాలకు తమ ఆనవాళ్లు చిక్కకుండా స్ప్రేయర్‌తో కెమెరా లెన్స్‌ను బ్లర్ చేయడం లేదా డీవీఆర్‌లను ఎత్తుకెళ్లడం చేసేవారని పోలీసులు తెలిపారు. దేవతా విగ్రహాలకు అలంకరించిన వెండి ఆభరణాలు, ప్రతిమలను అపహరించి, వాటిని కరిగించి విక్రయించేవారని వెల్లడించారు.
కంబదూరు పరిధిలోని రాంపురం మారెమ్మ ఆలయంలో సీసీ కెమెరాలను ధ్వంసం చేసి చోరీకి పాల్పడిన ఘటనపై కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పక్కా సమాచారంతో ముఠాను అదుపులోకి తీసుకుని విచారించగా పలు చోరీల వివరాలు వెలుగులోకి వచ్చాయి. కంబదూరు, బ్రహ్మసముద్రం, శెట్టూరు, పామిడి, బుక్కరాయసముద్రం, రామగిరి నసనకోట ముత్యాలమ్మ ఆలయం, రొద్దం ప్రాంతాలతో పాటు కర్ణాటకలోని తుమకూరు జిల్లా కొరటగెరె, క్యాససంద్ర పరిధుల్లో జరిగిన మొత్తం 9 చోరీ కేసులను పోలీసులు ఛేదించారు.
ముఠాలోని సాయికుమార్, చాంద్ బాషాలపై గతంలోనే పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం ఆరు పాత కేసులు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. మూడో నిందితుడు గుండప్పగారి సూదంపైన కూడా గతంలో కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఆదేశాల మేరకు డీఎస్పీ రవిబాబు పర్యవేక్షణలో కళ్యాణదుర్గం రూరల్ సీఐ నీలకంటేశ్వర, కంబదూరు ఎస్సై లోకేష్ తదితరులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా చేపట్టారు. పక్కా సమాచారంతో కంబదూరు చెక్‌పోస్ట్ వద్ద ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
దేవాలయాల భద్రతకు, ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు భంగం కలిగించే ఎలాంటి చర్యలనైనా సహించేది లేదని జిల్లా ఎస్పీ జగదీష్ స్పష్టం చేశారు. ఎంతటి దొంగల ముఠాలైనా చట్టం ముందు తలవంచాల్సిందేనని పేర్కొంటూ, కేసును చాకచక్యంగా ఛేదించిన కళ్యాణదుర్గం రూరల్ సర్కిల్ పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించారు.




