Kalyandurg: కరువు నేలకు కృష్ణా జలాలు.. చాపిరి చెరువుకు నీటి విడుదల!

Kalyandurg: కళ్యాణదుర్గం కరువు నేలకు కృష్ణా జలాలు. చాపిరి చెరువుకు నీటిని విడుదల చేసి గంగమ్మకు పట్టువస్త్రాలు, జలహారతి ఇచ్చిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు.

P.Sudhakar, Kalyanadurgam
Updated on: 24 Oct 2026 10:14 PM IST
Kalyandurg
X

Kalyandurg: కరువు నేలకు కృష్ణా జలాలు.. చాపిరి చెరువుకు నీటి విడుదల!

కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రాంతంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో సతమతమవుతున్న కళ్యాణదుర్గం ప్రాంతానికి కృష్ణా జలాలు చేరాయి. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కృషితో కళ్యాణదుర్గం మండలం చాపిరి చెరువుకు కృష్ణా జలాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు వేలాది మంది రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించి, గంగమ్మకు జలహారతి ఇచ్చారు. గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించి నీటికి ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఎన్నో అడ్డంకులను అధిగమించి కృష్ణా జలాలను తీసుకొచ్చామని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా కృష్ణా జలాల కోసం ఎదురుచూస్తున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సహకారంతో కాలువ పనులను పూర్తి చేయగలిగామని పేర్కొన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి తొలిసారిగా కృష్ణా జలాలను తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు.

గతంలో పాలించిన వారు ఈ ప్రాంతానికి సాగునీరు అందించడంపై తగిన శ్రద్ధ చూపలేదని ఎమ్మెల్యే విమర్శించారు. సాగునీరు అందితేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, రైతులకు భరోసా కలుగుతుందని అన్నారు. 2018లో బీటీపీకి నీటిని అందించేందుకు రూ.951 కోట్లతో కాలువ పనులు ప్రారంభించినప్పటికీ, వైసీపీ ప్రభుత్వ హయాంలో వాటిని నిలిపివేశారని పేర్కొన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ, 2028 మార్చి నాటికి పనులను పూర్తి చేసి కృష్ణా జలాలతో చెరువులను నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కాలువ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులను ఈ సందర్భంగా శాలువాలతో ఘనంగా సన్మానించారు.

P.Sudhakar, Kalyanadurgam

P.Sudhakar, Kalyanadurgam