Kalyandurg: కళ్యాణదుర్గం ప్రగతికి రూ.200.87 కోట్లు: ఎమ్మెల్యే సురేంద్రబాబు

Kalyandurg: కళ్యాణదుర్గం మున్సిపాలిటీకి రూ.200.87 కోట్లతో హ్యామ్ పనులు, రూ.179 కోట్లతో ఇంటింటికీ కుళాయి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు.

P.Sudhakar, Kalyanadurgam
Published on: 22 Sept 2026 9:08 PM IST
Kalyandurg
X

Kalyandurg: కళ్యాణదుర్గం ప్రగతికి రూ.200.87 కోట్లు: ఎమ్మెల్యే సురేంద్రబాబు

కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.200.87 కోట్లతో హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ ద్వారా వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. ఇంటింటికీ కుళాయి ద్వారా తాగునీరు అందించే పథకం పనులు రూ.179 కోట్లతో శరవేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు.

కళ్యాణదుర్గం పట్టణం విద్యానగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 123 మున్సిపాలిటీల అభివృద్ధి కోసం హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ ద్వారా చేపడుతున్న పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో ప్రారంభించగా.. కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే, మున్సిపల్ అధికారులు, టీడీపీ నాయకుల సమక్షంలో కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగునీరు అందించేందుకు రూ.179 కోట్లతో పథకాన్ని చేపట్టామని, పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని 32 వార్డుల్లో మౌలిక వసతులను మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు.

రూ.19 కోట్లతో 8.5 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధి, రూ.2.40 కోట్లతో మున్సిపల్ కాంప్లెక్స్ నిర్మాణం, మరో రెండు పార్కుల నిర్మాణానికి రూ.1.40 కోట్లతో పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఇప్పటికే నగరవనం ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. తిమ్మసముద్రం ఇండస్ట్రియల్ పార్కు నుంచి నూతిమడుగు వరకు రూ.40 కోట్లతో రోడ్డు మంజూరైందని తెలిపారు.

వాల్మీకి సర్కిల్‌ను ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దుతున్నామని, కనకదాసు విగ్రహాన్ని ఏర్పాటు చేసి సర్కిల్‌ను అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు రోడ్లకు ఇరువైపులా కాలువల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మున్సిపాలిటీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే మరో ఐదు నుంచి పదేళ్ల సమయం పట్టవచ్చని పేర్కొన్నారు.

బీటీపీ కాలువ పనులను పూర్తి చేసి రైతులకు నీరు అందించేందుకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో బీటీపీతో పాటు పేరూరు, పోలవరం, హంద్రీనీవా పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. అభివృద్ధి పనులపై ఏ పార్టీ నాయకుడు మంచి సూచన ఇచ్చినా స్వీకరిస్తామని స్పష్టం చేశారు.

డంప్‌యార్డు పనులు ఆలస్యం కావడానికి అధికారుల నివేదికల్లో తేడాలు కారణమవుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. డంప్‌యార్డు స్థలం కబ్జాకు గురైందేమో అన్న అనుమానంతో రీ-సర్వే చేయిస్తున్నామని తెలిపారు. కళ్యాణదుర్గం పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు.

P.Sudhakar, Kalyanadurgam

P.Sudhakar, Kalyanadurgam