Kalyandurg: ఆపరేషన్ క్లీన్ స్వీప్.. స్వయంగా చీపురు పట్టిన ఎమ్మెల్యే
Kalyandurg: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో ప్రతిష్టాత్మక “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సురేంద్ర బాబు ప్రారంభించారు.
Kalyandurg: ఆపరేషన్ క్లీన్ స్వీప్.. స్వయంగా చీపురు పట్టిన ఎమ్మెల్యే
Kalyandurg: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణంలోని వాల్మీకి కూడలిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే స్వయంగా చీపురు పట్టి మున్సిపల్ కార్మికులతో కలిసి రోడ్లను శుభ్రం చేశారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం కేవలం మున్సిపల్ సిబ్బంది బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు కూడా భాగస్వామి కావాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ప్రతి పట్టణాన్ని శుభ్రంగా, అందంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని సూచించారు.మున్సిపల్ కార్మికులు పట్టణ పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్నారని, వారి కష్టాన్ని ప్రజలు గుర్తించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి పరిశుభ్రతను బాధ్యతగా తీసుకుంటేనే పట్టణాలు ఆరోగ్యకరమైన వాతావరణంతో అభివృద్ధి చెందుతాయని తెలిపారు.
పట్టణంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డంప్ యార్డు క్లీనింగ్ పనులు పూర్తయినప్పటికీ, అందులో మిగిలిన ప్లాస్టిక్ మరియు ఇతర వ్యర్థాలను పూర్తిగా వేరు చేయకపోవడం వల్ల పనులు కొంతవరకు నిలిచిపోయాయని వెల్లడించారు. ఆ ప్రక్రియ పూర్తయితే ఆ స్థలాన్ని ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉపయోగంలోకి తీసుకువస్తామని తెలిపారు.“ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమం జూన్ 20వ తేదీ వరకు కొనసాగుతుందని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చెత్త వేరు చేసే విధానం, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తారని తెలిపారు.
పట్టణ పరిశుభ్రతలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి మున్సిపల్ శాఖకు సహకరించాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పిలుపునిచ్చారు.




