Kalyandurg: కూటమి జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ప్రచార రోడ్‌షో!

Kalyandurg: వైసీపీ గ్రామీణాభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని, కూటమి ప్రభుత్వంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు స్పష్టం చేశారు.

P.Sudhakar, Kalyanadurgam
Published on: 27 Oct 2026 6:23 PM IST
Kalyandurg
X

Kalyandurg: కూటమి జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ప్రచార రోడ్‌షో!

Kalyandurg: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వైసీపీ పాలనలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు విమర్శించారు. గ్రామాలకు వెళ్లే రహదారులను సైతం పట్టించుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. కూటమి ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.

కళ్యాణదుర్గం మండలంలో కూటమి జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ మంగళవారం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచార రోడ్‌షో నిర్వహించారు. జడ్పీటీసీ అభ్యర్థి గోళ్ల లక్ష్మీ వెంకటేషులు, ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి ఓబుళాపురం, మానిరేవు, నుసికొట్టాల, నుసికొట్టాల తాండా, బాలవెంకటాపురం గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. ఆయా గ్రామాల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు గజమాలలు వేసి, పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ.. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణాన్ని పాలకులు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. వైసీపీ పాలనలో గ్రామాల అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో రహదారులు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం గ్రామాల్లో అభివృద్ధి పనులను ఒక్కొక్కటిగా చేపడుతూ ముందుకు సాగుతోందని తెలిపారు.

కరువు ప్రాంతమైన కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారని, ప్రాంత అభివృద్ధికి సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందాలంటే స్థానిక సంస్థల్లో కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.

కూటమి జడ్పీటీసీ అభ్యర్థి గోళ్ల లక్ష్మీ వెంకటేషులుతో పాటు ఎంపీటీసీ అభ్యర్థులందరికీ సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు పాల్గొన్నారు.

P.Sudhakar, Kalyanadurgam

P.Sudhakar, Kalyanadurgam