Kalyandurg: కళ్యాణదుర్గం ‘నగరవనం’ త్వరలోనే ప్రారంభం
Kalyandurg: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ సమీపంలో అభివృద్ధి చేసిన 'నగరవనం' త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది.
Kalyandurg: కళ్యాణదుర్గం ‘నగరవనం’ త్వరలోనే ప్రారంభం
Kalyandurg: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణానికి సమీపంలో అభివృద్ధి చేసిన నగరవనం త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. నగరవనాన్ని అన్ని వర్గాల ప్రజలకు ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుతో కలిసి నగరవనాన్ని సందర్శించిన ఆయన అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు, అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా నగరవనంలోని పక్షుల కేంద్రం, చిన్నారుల ఆటస్థలం, కాటేజీలు, హిల్ వ్యూ పాయింట్‌లను కలెక్టర్ సందర్శించారు. ప్రకృతి అందాలు, పచ్చని వాతావరణం, సందర్శకులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించిన అనంతరం ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. నగరవనాన్ని మరింత అభివృద్ధి చేసి కుటుంబాలతో కలిసి సందర్శించే ఉత్తమ విహార కేంద్రంగా మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
వచ్చే నెలలో ప్రారంభం కానున్న జీ రామ్ జీ పథకం కింద రెండు కొత్త కాటేజీల నిర్మాణంతో పాటు తాగునీరు, విద్యుత్, రహదారులు, పారిశుద్ధ్య సౌకర్యాలు వంటి మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు, అంచనాలను సిద్ధం చేసి త్వరితగతిన పంపించాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.
అనంతరం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ నగరవనం ప్రారంభోత్సవానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఒకవేళ ఆయన అందుబాటులో లేకపోతే సంబంధిత మంత్రి చేత ప్రారంభోత్సవం నిర్వహించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. నగరవనం ప్రారంభమైతే కళ్యాణదుర్గం ప్రాంతానికి పర్యాటకంగా మంచి గుర్తింపు లభిస్తుందని అభిప్రాయపడ్డారు.
అలాగే బయటి ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకుల సౌకర్యార్థం రెండు నుంచి మూడు రిసార్ట్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసినట్లుఎమ్మెల్యే వెల్లడించారు. దీనిపై జిల్లా కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. నగరానికి సమీపంలో ఉండటంతో పాటు ఆహ్లాదకరమైన ప్రకృతి వాతావరణం కలిగి ఉండటం నగరవనం ప్రత్యేకత అని పేర్కొన్నారు. ప్రజలకు విశ్రాంతితో పాటు ప్రకృతి సోయగాలను ఆస్వాదించే అవకాశాన్ని కల్పించే ఈ ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కానుండటంతో స్థానికుల్లో ఆసక్తి నెలకొంది.




