Kanigiri: హుస్సేన్‌పురంలో అర్ధరాత్రి వరకు హైడ్రామా.. వైసీపీ అభ్యర్థి గెలుపు!
Kanigiri: వెలిగండ్ల మండలం హుస్సేన్‌పురం గ్రామపంచాయతీ ఎన్నికల లెక్కింపులో అర్ధరాత్రి వరకు హైడ్రామా నెలకొంది. చివరకు 17 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి తమ్మినేని గురవమ్మ గెలిచారు.
Kanigiri: హుస్సేన్‌పురంలో అర్ధరాత్రి వరకు హైడ్రామా.. వైసీపీ అభ్యర్థి గెలుపు!
కనిగిరి: మార్కాపురం జిల్లా వెలిగండ్ల మండలం హుస్సేన్‌పురం గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఓట్ల లెక్కింపు సమయంలో మొదలైన వివాదం అర్ధరాత్రి దాటినా కొనసాగడంతో గ్రామంలో హైడ్రామా నెలకొంది. చివరకు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తమ్మినేని గురవమ్మకు ఎన్నికల అధికారులు డిక్లరేషన్ ఫారం అందజేయడంతో వివాదానికి తెరపడింది.
హుస్సేన్‌పురం గ్రామపంచాయతీలో మొత్తం 10 వార్డులు ఉండగా, వీటిలో ఏడు వార్డుల్లో వైసీపీ, రెండు వార్డుల్లో టీడీపీ మద్దతుదారులు విజయం సాధించినట్లు సమాచారం. మరో వార్డు ఏకగ్రీవమైంది. ఇక సర్పంచ్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో వైసీపీ బలపరిచిన అభ్యర్థి తమ్మినేని గురవమ్మ 17 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్లు ప్రచారం జరిగింది. అయితే ఫలితాల ప్రకటన, డిక్లరేషన్ ఫారం జారీ విషయంలో వివాదం తలెత్తింది.
విద్యుత్ సరఫరా నిలిపివేసి బ్యాలెట్ పత్రాలు చించివేశారంటూ ఆరోపణలు
సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించలేక టీడీపీ నాయకులు కౌంటింగ్ కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిపివేయించి, బ్యాలెట్ పత్రాలను చించివేశారని వైసీపీ శ్రేణులు ఆరోపించాయి. ఎన్నికల అధికారి విజయం సాధించిన అభ్యర్థికి డిక్లరేషన్ ఫారం అందజేయకుండా జాప్యం చేస్తున్నారని వైసీపీ నాయకులు నిరసనకు దిగారు. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కౌంటింగ్ కేంద్రానికి దద్దాల నారాయణ యాదవ్
వివాదం విషయం తెలుసుకున్న కనిగిరి వైసీపీ ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ హుటాహుటిన హుస్సేన్‌పురం కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఎన్నికల అధికారిని కలిసి ఫలితాల ప్రకటనలో జాప్యానికి కారణమేంటని ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులు ఆయనను కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించేందుకు ప్రయత్నించడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
భారీగా పోలీసు బలగాల మోహరింపు
పరిస్థితి అదుపుతప్పకుండా డీఎస్పీ శ్రీనివాసరావు అదనపు పోలీసు బలగాలను రప్పించారు. ఓఎస్డీ నవదీప్ కుమార్ శర్మ పర్యవేక్షణలో కనిగిరి డివిజన్ పరిధిలోని పోలీసు బలగాలు భారీగా కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నాయి. మరోవైపు వైసీపీ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, హుస్సేన్‌పురం గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న భయాందోళనల మధ్య కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆర్డీవోను అడ్డుకున్న గ్రామస్తులు
సమస్యను పరిష్కరించేందుకు కనిగిరి ఆర్డీవో అజయ్ కుమార్ కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అయితే గ్రామస్తులు, వైసీపీ నాయకులు ఆయనను అడ్డుకోవడంతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో ఆర్డీవో అక్కడి నుంచి వెనుదిరిగినట్లు సమాచారం. డిక్లరేషన్ ఫారం అందజేసే వరకు ఆందోళన విరమించేది లేదని వైసీపీ నాయకులు పట్టుబట్టారు.
చివరకు అర్ధరాత్రి ఒంటిగంటకు డిక్లరేషన్
గంటల తరబడి కొనసాగిన ఉత్కంఠ, ఆందోళనల అనంతరం చివరకు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఎన్నికల అధికారులు వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తమ్మినేని గురవమ్మకు డిక్లరేషన్ ఫారం అందజేశారు. దీంతో 17 ఓట్ల మెజార్టీతో ఆమె విజయం సాధించినట్లు అధికారికంగా ధ్రువీకరణ లభించింది. ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రారంభమైన వివాదం, రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, పోలీసుల భారీ మోహరింపు, అధికారుల జోక్యం వెరసి హుస్సేన్‌పురం గ్రామంలో తీవ్ర ఉత్కంఠను రేకెత్తించింది. కాగా, కౌంటింగ్ కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిపివేత, బ్యాలెట్ పత్రాల ధ్వంసం ఆరోపణలపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.




