Dharmavaram: ధర్మవరంలో చేనేతల సమస్యకు మంత్రి సత్యకుమార్ యాదవ్ తక్షణ పరిష్కారం!

Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కేశవనగర్ చేనేత కార్మికుల సమస్యపై మంత్రి సత్యకుమార్ యాదవ్ తక్షణమే స్పందించారు. పెండింగ్‌లో ఉన్న 227 మంది నేతన్నల దరఖాస్తులకు ఆమోదం లభించింది.

NAGENDRA, DHARMAVARAM
Published on: 10 Oct 2026 9:46 AM IST
Dharmavaram
X

Dharmavaram: ధర్మవరంలో చేనేతల సమస్యకు మంత్రి సత్యకుమార్ యాదవ్ తక్షణ పరిష్కారం!

Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం, అక్టోబరు 09:– చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ తక్షణమే స్పందించి, నేతన్న సేవలో పథకానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అర్హుల దరఖాస్తులకు ఆమోదం లభించేలా చర్యలు తీసుకున్నారని హరీష్ బాబు పేర్కొన్నారు.

ధర్మవరం పట్టణంలోని కేశవనగర్‌కు చెందిన 227 మంది చేనేత కార్మికులు, ఇతర నేతన్నలు శుక్రవారం మంత్రి కార్యాలయానికి వచ్చి తమ సమస్యలను మంత్రి నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు దృష్టికి తీసుకువచ్చారు. తాము నిజమైన చేనేత కార్మికులమైనప్పటికీ నేతన్న సేవలో పథకం ప్రయోజనం పొందేందుకు సంబంధించిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, తమకు కూడా ప్రభుత్వ ఆర్థిక సాయం అందేలా చూడాలని కోరారు.

చేనేత కార్మికులు తమ సమస్యను వివరించిన వెంటనే హరీష్ బాబు ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు సమాచారం అందించారు. దీనిపై మంత్రి వెంటనే స్పందించి, రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత, సంబంధిత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, హ్యాండ్లూమ్ కమిషనర్ రేఖారాణితో మాట్లాడి ధర్మవరం చేనేత కార్మికుల సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లారు.

నిజమైన చేనేత కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకం ప్రయోజనం అందకుండా ఉండకూడదనే ఉద్దేశంతో, పెండింగ్‌లో ఉన్న అర్హుల దరఖాస్తులను పరిశీలించి ఆమోదించేలా సంబంధిత అధికారులతో మంత్రి సంప్రదింపులు జరిపారు. మంత్రి చొరవతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు ఆమోదం లభించగా, ఆమోదం పొందిన లబ్ధిదారుల జాబితా ధర్మవరం హ్యాండ్లూమ్ ఏడీ కి అందింది.

చేనేత కార్మికుల సమస్యను తెలుసుకున్న వెంటనే రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ద్వారా మంత్రి సత్యకుమార్ యాదవ్ నేతన్నల సంక్షేమం పట్ల తనకున్న నిబద్ధతను చాటుకున్నారని హరీష్ బాబు అన్నారు.

అర్హత ఉన్న నిజమైన చేనేత కార్మికులకు నేతన్న సేవలో పథకం ద్వారా ప్రభుత్వ ఆర్థిక సాయం అందేలా చూడటమే లక్ష్యంగా ఆయన స్పందించారు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలని, అర్హత ఉన్నప్పటికీ సాంకేతిక లేదా పరిపాలనాపరమైన కారణాలతో ఎవరూ నష్టపోకూడదన్నదే మంత్రి లక్ష్యమని హరీష్ బాబు పేర్కొన్నారు.. చేనేత కార్మికుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హరీష్ బాబు తెలిపారు.

NAGENDRA, DHARMAVARAM

NAGENDRA, DHARMAVARAM