Penukonda: పెనుకొండలో పండుగలా చంద్రన్న బర్త్‌డే.. 76 కేజీల కేక్ కటింగ్
Penukonda: పెనుకొండలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను మంత్రి సవిత ఘనంగా నిర్వహించారు.
Penukonda: పెనుకొండలో పండుగలా చంద్రన్న బర్త్‌డే.. 76 కేజీల కేక్ కటింగ్
Penukonda: సీఎం చంద్రబాబునాయుడితోనే రాష్ట్రానికి భవిష్యత్తు అని, తన విజనరీ నాయకత్వంతో ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలపుతున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. 76 ఏళ్ల నవ యువకుడిలా ఏపీ అభివృద్ధికి ఆయన రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు. చంద్రబాబు అంటేనే నిజాయితీకి, నిబద్ధతకు నిలువుటద్దమన్నారు. సీఎం చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజక వర్గ కేంద్రంలో సోమవారం మంత్రి సవిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కియా పరిశ్రమ ఎదుట 76 కేజీల కేక్ ను కట్ చేశారు. అంతకుముందు పెద్ద చెరువు కట్ట ఆంజనేయస్వామి దేవాలయం ఎదుట 76 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ, సీఎం చంద్రబాబుకు పెనుకొండ నియోజక వర్గ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్ననాటి నుంచే సామాజిక సేవల పట్ల ఆసక్తి ఉండే చంద్రబాబునాయుడు రాజకీయ ప్రవేశం చేశారన్నారు. 1978లో చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారని,
తన 28వ ఏటే ఆనాటి ముఖ్యమంత్రి అంజయ్య మంత్రి వర్గంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ మంత్రిగా తనదైన ముద్ర వేశారన్నారు. అన్న ఎన్టీఆర్ టీడీపీని ప్రారంభిస్తే, క్షేత్రస్థాయిలోకి పార్టీని తీసుకెళ్లి బలోపేతం చేసిన ఘనంగా సీఎం చంద్రబాబుదేనన్నారు. నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారన్నారు. సీఎం చంద్రబాబు అంటేనే నీతి నిజాయితీకి, నిబద్ధతకు మారుపేరన్నారు. సీబీఎన్ బ్రాండ్ ఇమేజ్ తోనే ఏపీకి అత్యధిక పెట్టుబడులు, భారీ పరిశ్రమలు తరలొస్తున్నాయన్నారు.
పెనుకొండలో అంతర్జాతీయ పరిశ్రమ కియా ను స్థాపించి, లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తూ, ఏపీని నెంబర్ వన్ తీర్చిదిద్తుతున్నారన్నారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో సీఎం చంద్రబాబుదే ప్రధాన పాత్ర అని అన్నారు. ఒకవైపు రాయలసీమను సస్య శ్యామలం చేస్తూనే పారిశ్రామిక హబ్ గా, హార్టీకల్చర్ హబ్ గా, డ్రోన్ హబ్ గా అభివృద్ధి చేస్తున్నారని మంత్రి సవిత కొనియాడారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో పనిచేయడం, ఆయన క్యాబినెట్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం తన పూర్వ సుకృత మన్నారు.
వైసీపీ బెదిరింపులకు భయపడం
జగన్, వైసీపీ బ్యాచ్ బెదిరింపులకు, తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని మంత్రి సవిత స్పష్టం చేశారు. వాళ్లలాగ దోచుకోవడం, దాచుకోవడం, నేరాలకు పాల్పడడం తమకు చేతకాదన్నారు. తామెనాడూ అవినీతికి, అక్రమాలకు పాల్పడలేదన్నారు. సీఎం చంద్రబాబు చూపిన మార్గంలో క్రమశిక్షణతో పయనిస్తూ,
ప్రజాసేవకు అంకితమయ్యామన్నారు. జగన్ కు, వైసీపీ బ్యాచ్ కు బెదిరింపులకు పాల్పడడం అలవాటుగా మారిందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామిక వేత్తలను, కాంట్రాక్టర్లను, అధికారులను, చివరికి ప్రజలను కూడా బెదిరిస్తూ, రాజకీయాలు చేస్తున్నారన్నారు. వారి బెదిరింపులకు ఎవరూ భయపడే ప్రసక్తే లేదని మంత్రి సవిత స్పష్టంచేశారు.
జగన్ చాప్టర్ క్లోజ్.. మళ్లీ మళ్లీ చంద్రబాబే సీఎం..
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని మంత్రి సవిత మండిపడ్డారు. జగన్ అసమర్థ పాలనను చూసి, ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. రాష్ట్రంలో సంపద సృష్టిస్తూ, ఉపాధి కల్పిస్తూ సీఎం చంద్రబాబునాయుడు ఏపీలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారన్నారు.
ఎన్నికల హామీలను నెరవేరుస్తూ, సంక్షేమ పథకాలు అందజేస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రంతో పాటు తమ భవిష్యత్తు కూడా బాగుంటుందని ప్రజల అభిప్రాయమన్నారు. సీఎం చంద్రబాబునే మళ్లీ మళ్లీ సీఎంగా చేసుకుందామని ప్రజలు డిసైడయ్యారన్నారు. మరోసారి వైసీపీ అధికారంలోకి రావడం కల్ల అని మంత్రి సవిత స్పష్టం చేశారు.
ఘనంగా చంద్రన్న జన్మదిన వేడుకలు
అంతకుముందు పెనుకొండ నియోజక వర్గంలో సీఎం చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు మంత్రి సవిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పెద్ద చెరువు కట్ట ఆంజనేయస్వామి దేవాలయం ఎదుట 76 కొబ్బరి కాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలనలో ఒడిదుడుకులు ఎదుర్కునేలా సీఎం చంద్రబాబుకు శక్తినివ్వాలంటూ ఆంజనేయస్వామిని మంత్రి సవిత కోరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా కియా పరిశ్రమ వరకు వెళ్లారు. అక్కడ 76 కేజీల భారీ కేక్ ను కూటమి నాయకులు, కార్యకర్తలతో మంత్రి సవిత కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




