Anantapur: కళ్యాణదుర్గంలో ఎల్ నినో వర్షాభావ పరిస్థితులపై సమీక్ష!
Anantapur: కళ్యాణదుర్గంలో ఎల్ నినో వర్షాభావ పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. రైతులకు, పశుసంపదకు రక్షణ కల్పించాలని ఆదేశం.
Anantapur: కళ్యాణదుర్గంలో ఎల్ నినో వర్షాభావ పరిస్థితులపై సమీక్ష!
Anantapur: కళ్యాణదుర్గం నియోజకవర్గం లో ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులను, పశుసంపదను కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రతి రైతుకు పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ అందేలా చూడాలని, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల పరిస్థితులను పరిశీలించాలని సూచించారు.
కళ్యాణదుర్గం ప్రజావేదికలో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంతంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పశుసంపదకు అవసరమైన దాణా, గడ్డి, నీటి వసతులపై అధికారులతో చర్చించారు.
95 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారం కళ్యాణదుర్గం ప్రాంతంలో సుమారు 95 శాతం మంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. సాధారణంగానే ఈ ప్రాంతంలో వర్షపాతం తక్కువగా ఉంటుందని, ఈసారి ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో రైతులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతులను ఆదుకునేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
పార్టీలకు అతీతంగా ప్రతి రైతుకు పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రేపటి నుంచి వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు గ్రామాల్లో పర్యటించి రైతుల పరిస్థితిని పరిశీలించి, అవసరమైన చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
8 లక్షల పశుసంపదను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కళ్యాణదుర్గం ప్రాంతంలో సుమారు 8 లక్షల పశుసంపద ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో పశువులకు అవసరమైన గడ్డి, దాణాను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వం నుంచి సబ్సిడీతో పాటు దాతల సహకారంతోనైనా దాణా, గడ్డి అందించేలా చర్యలు తీసుకుంటే పశుసంపదను కొంతవరకు కాపాడుకునే అవకాశం ఉంటుందని అన్నారు. పశుసంపదను కాపాడేందుకు గడ్డి, దాణా అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లామని ఎమ్మెల్యే తెలిపారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి తప్పకుండా ఆదుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు.
నీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కళ్యాణదుర్గం ప్రాంతంలో నీటి అవసరాల కోసం ప్రభుత్వం ఎమ్మెల్యే గ్రాంటు కింద కోటి రూపాయలు కేటాయించిందని అమిలినేని తెలిపారు. మంత్రి అనుమతితో ఆ నిధులను పశుసంపదను కాపాడేందుకు అవసరమైన చర్యలకు వినియోగించేలా చూస్తానని చెప్పారు.
అలాగే కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో తాగునీటి సరఫరా కోసం 10 నుంచి 12 ట్రాక్టర్ ట్యాంకర్లను సిద్ధం చేస్తున్నామని, వారం నుంచి పది రోజుల్లో అవి అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. రైతులు, పశుపోషకులు ఇబ్బందులు పడకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు.




