Kalyandurg: ప్రతి ఇంట్లో మహిళా వ్యాపారవేత్త ఉండాలి.. ఎమ్మెల్యే పిలుపు

Kalyandurg: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆకాంక్షించారు.

P.Sudhakar, Anantapuram
Published on: 13 May 2026 9:19 PM IST
Kalyandurg
X

Kalyandurg: ప్రతి ఇంట్లో మహిళా వ్యాపారవేత్త ఉండాలి.. ఎమ్మెల్యే పిలుపు

Kalyandurg: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మహిళల ఆర్థిక సాధికారతే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. ప్రజావేదికలో సెర్ప్ పీడీ శైలజ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సంఘాల యానిమేటర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.కార్యక్రమం ప్రారంభానికి ముందు మహిళలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం నియోజకవర్గంలోని 209 మంది వీఓఏ యానిమేటర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక మహిళ వ్యాపారవేత్తగా ఎదిగి కుటుంబానికి ఆర్థిక స్థిరత్వం తీసుకురావాలని సూచించారు. దేశంలో మహిళా సంఘాల ఏర్పాటు ద్వారా మహిళలకు ఆర్థిక బలం కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడిదేనని అన్నారు. మహిళా సంఘాల ద్వారా పొదుపు అలవాటు పెంపొందించి,స్వయం ఉపాధి అవకాశాలు సృష్టించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో మహిళా సంఘాలకు సంబంధించిన స్త్రీనిధి రుణాలు సక్రమంగా వినియోగం కాకపోవడంతో కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని పలు మండలాలు బ్లాక్‌లిస్ట్‌లోకి వెళ్లాయని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆ పరిస్థితిని మార్చేందుకు చర్యలు చేపట్టిందన్నారు. ఇప్పటికే కంబదూరు, కళ్యాణదుర్గం మండలాలను బ్లాక్‌లిస్ట్ నుంచి తొలగించి ఒక్కో మండలానికి రూ.40 లక్షల మేర స్త్రీనిధి రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

స్మార్ట్ ఫోన్లను ప్రభుత్వ పథకాల అమలు, మహిళా సంఘాల నిర్వహణ కోసం సమర్థంగా వినియోగించాలని ఎమ్మెల్యే సూచించారు. వాటిని పిల్లల వినోదానికి ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.అనంతరం నెక్ (నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ) ఆధ్వర్యంలో కంబదూరు, కుందుర్పి, శెట్టూరు మండలాలకు ఉచితంగా అందించిన ఎగ్ కార్ట్ ఫాస్ట్ ఫుడ్ బండ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. మహిళలు చిన్న వ్యాపారాల ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

P.Sudhakar, Anantapuram

P.Sudhakar, Anantapuram

Next Story