Kalyandurg: ఎమ్మెల్యే అమిలినేని విద్యా సంక్షేమ పథకం ప్రారంభం!
Kalyandurg: ములకలేడులో ఎస్ఆర్సీ ట్రస్ట్ సహకారంతో రూ.5 కోట్ల వ్యయంతో కూడిన అమిలినేని విద్యాచక్రం ఉచిత సైకిళ్ల పంపిణీని ప్రారంభించారు.
Kalyandurg: ఎమ్మెల్యే అమిలినేని విద్యా సంక్షేమ పథకం ప్రారంభం!
కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు రవాణా ఇబ్బందుల కారణంగా చదువుకు దూరం కాకుండా ఉండాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "అమిలినేని విద్యాచక్రం" కార్యక్రమానికి మంగళవారం శెట్టూరు మండలం ములకలేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీకారం చుట్టారు. ఎస్‌ఆర్‌సీ ట్రస్ట్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొలి విడతగా 9వ, 10వ తరగతులు మరియు ఇంటర్మీడియట్ చదువుతున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉచిత సైకిళ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు రవాణా సమస్యలు ఎదుర్కొంటున్నారని, అలాంటి ఇబ్బందులు వారి విద్యకు ఆటంకం కాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఎస్‌ఆర్‌సీ ట్రస్ట్ సహకారంతో రూ.5 కోట్ల వ్యయంతో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న మొత్తం 7,300 మంది విద్యార్థులకు దశలవారీగా ఉచిత సైకిళ్లు అందజేయనున్నట్లు వెల్లడించారు.
విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు అభ్యసించి మంచి స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. గత 20 సంవత్సరాలుగా విద్యార్థుల సంక్షేమం కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తమ సేవా కార్యక్రమాలకు నిరంతరం సహకరిస్తున్న ఎస్‌ఆర్‌సీ ట్రస్ట్ చైర్మన్ ముత్తినేని రాజగోపాల్, సీఎఫ్‌వో షీమా, ఎండీ అమిలినేని యశ్వంత్, డైరెక్టర్లు దేవినేని నవీన్ కుమార్, దేవినేని ధర్మతేజ, దేవినేని అవినాష్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అభివృద్ధి అంశాలపై కూడా ఎమ్మెల్యే స్పందించారు. తిమ్మసముద్రం వద్ద నాలుగు వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని, దీని ద్వారా స్థానిక యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అలాగే తల్లిదండ్రులు లేని సచిన్ అనే విద్యార్థి చదువు బాధ్యతను పూర్తిగా తానే తీసుకుంటానని ప్రకటించారు. తల్లిదండ్రులు పిల్లలను సెల్‌ఫోన్లు, సోషల్ మీడియాకు దూరంగా ఉంచి విద్యపై దృష్టి సారించేలా ప్రోత్సహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం రామ్మోహన్ చౌదరి, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్లు రామకృష్ణ, వైపీ రమేష్, మార్కెట్ యార్డు చైర్మన్ గోళ్ల లక్ష్మీదేవి, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామీణ విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడే ఈ కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు.




