Anantapur: అనంతపురంలో సరికొత్త 'ధ్యాన కేంద్రం'.. భూమి పూజ చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి!
Anantapur: అనంతపురం శారద నగర్‌లో రూ. 50 లక్షలతో ధ్యాన, యోగ కేంద్రానికి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ భూమి పూజ.
Anantapur: అనంతపురంలో సరికొత్త 'ధ్యాన కేంద్రం'.. భూమి పూజ చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి!
Anantapur: 164 స్థానాలు గెలిచి ఒక సువర్ణాధ్యాయం లిఖించిన రోజుగా జూన్ 4వ తేదీ రాష్ట్ర చరిత్రలో మిగిలిపోతుందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అలాంటి ఒక ముఖ్యమైన రోజు ఎప్పటికీ గుర్తుండే విధంగా అనంతపురం నగరంలోని శారద నగర్ లో ధ్యాన, యోగ కేంద్రానికి భూమి పూజ చేశారు. శారద నగర్ లోని రెండవ క్రాస్ లో రూ.50 లక్షలతో ఈ ధ్యాన కేంద్రాన్ని నిర్మించ తలపెట్టారు.
ఈ ధ్యాన కేంద్ర నిర్మాణానికి జరిగిన భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటితో పాటు ఆర్డిటి నిర్వాహకులు మాంఛో ఫెర్రర్, టిడిపి నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిందని... అందుకు గుర్తుగా ఈ ధ్యాన యోగా కేంద్ర నిర్మాణాన్ని చేపట్టినట్లు వివరించారు. శారద నగర్ లో ఈ ధ్యాన యోగా కేంద్రం ప్రారంభించాలని చాలా రోజుల నుంచి విజ్ఞప్తి చేస్తున్నారని.. అయితే గత ప్రభుత్వం దీనిని పక్కన పెట్టిందన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఇందుకోసం నిధులు తీసుకొచ్చి నిర్మాణం ప్రారంభించామన్నారు. ఆర్డిటి సంస్థ జిల్లాలో చేస్తున్న సేవా కార్యక్రమాలకు గుర్తుగా అలాగే శారద నగర్ ప్రాంతంలోనే, ఆర్డిటి కార్యాలయం ఉన్న నేపథ్యంలో ఈ ధ్యాన యోగా కేంద్రానికి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ పేరును పెడుతున్నట్లుగా చెప్పారు. జిల్లాలో ప్రభుత్వంతో సమానంగా అన్ని వర్గాలకు సేవా కార్యక్రమాలు అందిస్తున్న గొప్ప సంస్థ ఆర్డిటి అని అన్నారు. ఆ సంస్థ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని.. అందుకే ఈ కేంద్రానికి ఫాదర్ పేరు పెట్టినట్లు వివరించారు.
కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే నగరంలో 180 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు వివరించారు. నగరంలో రోడ్లు, డ్రైనేజీలు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చాలా వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ రెండేళ్లలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని వివరించారు. రాష్ట్రానికి 25 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షలకు పైగా ఉద్యోగాలు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కు దక్కుతుందని దగ్గుపాటి అన్నారు.




