Kalyandurg: బలిజ కళ్యాణమంటపం నిర్మాణానికి రూ.30 లక్షలు

Kalyandurg: కళ్యాణదుర్గంలో నిలిచిపోయిన బలిజ కళ్యాణమంటపం నిర్మాణానికి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ రూ.30 లక్షలు కేటాయించారు. ఎమ్మెల్యే సురేంద్రబాబుతో శంకుస్థాపన.

P.Sudhakar, Kalyanadurgam
Published on: 12 Oct 2026 11:46 PM IST
Kalyandurg
X

Kalyandurg: బలిజ కళ్యాణమంటపం నిర్మాణానికి రూ.30 లక్షలు

కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో నిలిచిపోయిన బలిజ కళ్యాణమంటపం నిర్మాణానికి మళ్లీ అడుగులు పడ్డాయి. అసంపూర్తిగా ఉన్న నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తన ఎంపీ నిధుల నుంచి రూ.30 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో చేపట్టనున్న పనులకు ఎంపీ, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు శంకుస్థాపన చేశారు. బలిజ సంఘం ప్రతినిధులు, టీడీపీ నాయకుల సమక్షంలో నిర్మాణ పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ.. కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు తీసుకురావడంతో పాటు అవసరమైన చోట సొంత నిధులను కూడా వెచ్చించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రతి సామాజిక వర్గానికి సొంతంగా కళ్యాణమంటపం ఉండాలనే లక్ష్యంతో నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన బలిజ కళ్యాణమంటపం నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయిందని ఎమ్మెల్యే వివరించారు. ఎన్నికలకు ముందు తాను రూ.10 లక్షలు అందించడంతో పాటు, బెంగళూరుకు చెందిన ఇతర కంపెనీల ద్వారా మరో రూ.15 లక్షలు సమకూర్చినా నిర్మాణం పూర్తికాలేదన్నారు. ఈ సమస్యను ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన రూ.30 లక్షలు కేటాయించారని తెలిపారు.

తాజాగా కేటాయించిన నిధులతో మిగిలిన పనులను పూర్తి చేసి, అన్ని సౌకర్యాలతో కూడిన కళ్యాణమంటపాన్ని త్వరలోనే బలిజ సామాజిక వర్గానికి అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ భవనం అందుబాటులోకి వస్తే పేద, మధ్యతరగతి కుటుంబాలు వివాహాలు, ఇతర శుభకార్యాలను నిర్వహించుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బలిజ సంఘం నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

P.Sudhakar, Kalyanadurgam

P.Sudhakar, Kalyanadurgam