మంత్రి నారా లోకేష్ అనంత పర్యటన: బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిలో ఫాదర్ ఫెర్రర్ ఘాట్ సందర్శన
మంత్రి నారా లోకేష్ ఈనెల 14, 15 తేదీల్లో అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. బత్తలపల్లిలో ఆర్డీటీ వ్యవస్థాపకులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఘాట్‌ను సందర్శించనున్న లోకేష్.
ధర్మవరం/బత్తలపల్లి: ఆర్డీటీ వ్యవస్థాపకులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఘాట్ ను ఐటీ, విద్యాశాఖ మంత్రి, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ సందర్శించనున్నారు. ఈనెల 14, 15తేదీల్లో మంత్రి లోకేష్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ముందుగా 14వ తేదిన బత్తలపల్లికి చేరుకుని.. అక్కడ ఆర్డీటీ ఆసుపత్రి ఆవరణలో ఉన్న ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఘాట్ ను సందర్శించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి లోకేష్ టీంతో కలిసి ధర్మవరం టిడిపి ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ పరిశీలించారు. ఘాట్ ను పరిశీలించిన అనంతరం ఆర్డీటీ ఆసుపత్రి నిర్వాహకులు, వైద్యులతో మాట్లాడారు.
ఇటీవల ఆర్డీటీకి ఎఫ్.సి.ఆర్.ఏ రెన్యూవల్ చేయించడంలో మంత్రి నారా లోకేష్ ఢిల్లీ స్థాయిలో కీలకంగా వ్యవహరించారని ఈ సందర్భంగా శ్రీరామ్ గుర్తు చేశారు. లక్షల మందికి సేవా కార్యక్రమాలు అందిస్తున్న ఆర్డీటీ సంస్థ విషయంలో మొదటి నుంచి మంత్రి లోకేష్ సానుకూలంగా ఉన్నారని.. ఎఫ్.సి.ఆర్.ఏ రెన్యూవల్ కోసం ఆయన చాలా కృషి చేశారన్నారు. అందుకే జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ముందు ఫాదర్ ఫెర్రర్ ఘాట్ ను సందర్శించనున్నట్టు తెలిపారు. ఆ తర్వాత ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను కూడా పరిశీలిస్తారని చెప్పారు. మరోవైపు బత్తలపల్లికి మంత్రి నారా లోకేష్ రానున్న నేపథ్యంలో భారీ స్వాగతం పలికే విధంగా శ్రీరామ్ ప్రణాళిక చేస్తున్నారు. ఆర్.కే. ఫంక్షన్ హాల్లో ధర్మవరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా ఏర్పాట్లను పరిశీలించారు. ఆ తర్వాత ధర్మవరంలోని పార్టీ కార్యాలయంలో ధర్మవరం పట్టణ, రూరల్ మండలాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. నారా లోకేష్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు, ఇతర వాటిపై చర్చించారు. బత్తలపల్లిలో మంత్రి లోకేష్ కు భారీ స్వాగతం పలికేందుకు శ్రేణులంతా తరలిరావాలని శ్రీరామ్ పిలుపునిచ్చారు. ఈ పర్యటనను విజయవంతం చేద్దామని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.




