Anantapur: పెళ్లైన నెల రోజులకే నవవధువును రోకలిబండతో మోది చంపిన భర్త

Anantapur: పెళ్లైన నెల రోజులకే నవవధువు శాంతి(26)ని భర్త మహేష్ రోకలిబండతో కొట్టి హత్య చేశాడు. మృతదేహం దుర్వాసన రావడంతో వెలుగుచూసిన ఈ ఘటనపై కేసు నమోదైంది.

ANIL KUMAR, ANANTHAPURAM
Updated on: 12 Aug 2026 2:04 PM IST
Anantapur
X

Anantapur: పెళ్లైన నెల రోజులకే నవవధువును రోకలిబండతో మోది చంపిన భర్త

Anantapur: అనంతపురంలో దారుణం వెలుగుచూసింది. పెళ్ళైన నెల రోజులకే నవవధువు దారుణ హత్యకు గురైంది. భర్తే కాలయముడై భార్య తలపై రోకలిబండతో మోది ప్రాణాలు తీసిన ఘటన అనంతపురంలోని ఎల్లమ్మ కాలనీలో తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గుంటూరు ప్రాంతానికి చెందిన శాంతి(26)కి, శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం పోతుకుంట గ్రామానికి చెందిన మహేష్(33)కు నెల రోజుల క్రితం పెళ్లైంది. మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమైన వీరికి పెద్దలు వివాహం జరిపించారు. వృత్తిరీత్యా డ్రైవర్ అయిన మహేష్, నెల రోజుల క్రితమే భార్య శాంతితో కలసి అనంతపురంలోని ఎల్లమ్మ కాలనీకి వచ్చి అద్దెకు ఉంటున్నాడు.

ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డిఎస్పి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వన్ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు తెరిచి చూడగా, శాంతి రక్తం మడుగులో శవమై కనిపించింది. తలపై రోకలిబండతో బాది హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ దారుణం రెండు రోజుల క్రితమే జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కొత్తగా పెళ్ళైన ఈ దంపతుల మధ్య ఏవైనా మనస్పర్థలు, వివాదాలు తలెత్తాయా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతం నిందితుడు మహేష్ పరారీలో ఉన్నాడు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఒకటవ పట్టణ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story