O.D. Cheruvu: నీట్-2026 జాతీయ స్థాయిలో సత్తా చాటిన కుశ్వంత్

O.D. Cheruvu: నీట్-2026 ఫలితాల్లో ఆల్ ఇండియా 1224వ ర్యాంకు సాధించిన ఓ.డి. చెరువు విద్యార్థి కుశ్వంత్ కుమార్ రెడ్డి. ఎయిమ్స్‌లో వైద్య విద్య లక్ష్యంగా అడుగులు.

S.Firoz, Sri Sathya Sai
Published on: 18 July 2026 8:21 PM IST
O.D. Cheruvu
X

O.D. Cheruvu: నీట్-2026 జాతీయ స్థాయిలో సత్తా చాటిన కుశ్వంత్

ఓ.డి. చెరువు: కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నీట్–2026 (NEET-UG) ప్రవేశ పరీక్ష ఫలితాల్లో శ్రీ సత్యసాయి జిల్లా ఓ.డి. చెరువు మండలానికి చెందిన విద్యార్థి ఎం. కుశ్వంత్ కుమార్ రెడ్డి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు గర్వకారణంగా నిలిచాడు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఆయన ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) 1224తో పాటు కేటగిరీ ర్యాంక్ 695 సాధించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు.

కుశ్వంత్ కుమార్ రెడ్డి తల్లిదండ్రులు వై. నిర్మలమ్మ, గౌనిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఎస్‌జీటీ ఉపాధ్యాయురాలు కాగా, ఎం. జయసింహ రెడ్డి ఓ.డి. చెరువులోని రెయిన్బో ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్‌గా సేవలందిస్తున్నారు. కదిరి మండలం మిద్దివారిపల్లెకు చెందిన ఈ కుటుంబం ప్రస్తుతం ఓ.డి. చెరువులో స్థిరపడి విద్యారంగంలో సేవలు అందిస్తోంది.

చిన్ననాటి నుంచే పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో వైద్య వృత్తిని ఎంచుకున్న కుశ్వంత్, క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర శ్రమతో నీట్ పరీక్షకు సిద్ధమయ్యాడు. ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ అత్యుత్తమ ర్యాంకు సాధించి తన లక్ష్య సాధనలో కీలక ముందడుగు వేశాడు.

తన ప్రతిభతో దేశంలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్ (AIIMS) వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించి, భవిష్యత్తులో కార్డియాలజిస్ట్‌గా ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.

గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థి జాతీయ స్థాయిలో ఈ అరుదైన విజయాన్ని సాధించడంపై బంధుమిత్రులు, ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు, పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ కుశ్వంత్ కుమార్ రెడ్డికి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత వైద్యుడిగా ఎదిగి సమాజానికి విశిష్ట సేవలు అందించాలని ఆకాంక్షించారు.

S.Firoz, Sri Sathya Sai

S.Firoz, Sri Sathya Sai

Next Story