Gooty: ఎంబీబీఎస్, బీడీఎస్ ఫీజుల పెంపును వెంటనే రద్దు చేయాలి!
Gooty: ఎంబీబీఎస్, బీడీఎస్ ఫీజుల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి: గుత్తిలో పీడీఎస్‌యూ నేతల డిమాండ్.
Gooty: ఎంబీబీఎస్, బీడీఎస్ ఫీజుల పెంపును వెంటనే రద్దు చేయాలి!
Gooty: రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో MBBS, BDS ఫీజులను పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని PDSU నియోజకవర్గ కార్యదర్శి వి.వినోద్ డిమాండ్ చేశారు.
అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని శ్రీ సాయి జూనియర్ కళాశాలలో PDSU ఆధ్వర్యంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వి.వినోద్ మాట్లాడుతూ ఇప్పటికే వైద్య విద్య అత్యంత ఖరీదైన విద్యగా మారిందని, మరోసారి ఫీజులు పెంచడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందన్నారు.
2026-27 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో UG కోర్సుల ఫీజులను ప్రభుత్వం పెంచిందని తెలిపారు. MBBS Management Quota ఫీజు రూ. 13.20 లక్షల నుంచి రూ. 14.52 లక్షలకు, NRI Quota ఫీజు రూ. 39.60 లక్షల నుంచి రూ. 43.56 లక్షలకు, BDS Management Quota ఫీజు రూ. 4.40 లక్షల నుంచి రూ. 4.84 లక్షలకు, NRI Quota ఫీజు రూ. 13.20 లక్షల నుంచి రూ. 14.52 లక్షలకు పెరిగిందని పేర్కొన్నారు.
ఇది కేవలం ఫీజుల పెంపు కాదని, డాక్టర్ కావాలనే లక్ష్యంతో ఉన్న వేలాది మంది విద్యార్థుల కుటుంబాలపై అదనపు భారాన్ని మోపే నిర్ణయమని విమర్శించారు. NEET కోచింగ్, అప్లికేషన్ ఫీజులు, హాస్టల్, పుస్తకాల ఖర్చులతో మధ్యతరగతి కుటుంబాలు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నాయని, ఫీజుల పెంపుతో వైద్య విద్య సామాన్యులకు మరింత దూరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
"డబ్బున్నవారికే డాక్టర్ అయ్యే అవకాశం కాదు - ప్రతిభ ఉన్న ప్రతి విద్యార్థికి వైద్య విద్య అందాలి" అని నినదించారు. ప్రభుత్వం వెంటనే ఫీజుల పెంపు నిర్ణయాన్ని పునఃపరిశీలించి ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో MBBS, BDS విద్యార్థులను కలుపుకొని దశలవారీగా ఉద్యమాలకు శ్రీకారం చుడుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో PDSU నియోజకవర్గ ఉపాధ్యక్షులు వై.రాజ్ కుమార్, కార్యవర్గ సభ్యుడు బి.రాజేష్, గుత్తి మండల అధ్యక్షులు ఎం.తన్వీర్, మండల నాయకులు అజయ్, నవీన్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.




