Penukonda: జగన్ క్రెడిట్లు మాకొద్దు.. మాది అభివృద్ధి క్రెడిట్ మంత్రి సవిత
Penukonda: పెనుకొండలో బీసీ బాలుర గురుకుల పాఠశాలను ప్రారంభించిన మంత్రి సవిత. జగన్ దౌర్భాగ్యపు క్రెడిట్లు కూటమి ప్రభుత్వానికి వద్దంటూ తీవ్ర విమర్శలు.
Penukonda: జగన్ క్రెడిట్లు మాకొద్దు.. మాది అభివృద్ధి క్రెడిట్ మంత్రి సవిత
పెనుకొండ: ‘హంతకులను పరామర్శించడం జగన్ క్రెడిట్... రప్పా రప్పా నరకడం వైసీపీ క్రెడిట్... విధ్వంసం వాళ్ల క్రెడిట్... ఆ క్రెడిట్ మాకు అవసరం లేదు... మా క్రెడిట్ అభివృద్ధి... అదే మాకు చాలు’ రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. పేదోడి కడుపు నింపే అన్న క్యాంటీన్లను మూసేసిన దౌర్భాగ్యపు క్రెడిట్ ఎవరికీ అక్కర్లేదన్నారు.
బోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి టెంకాయ కొట్టేంది తామే... ప్రారంభోత్సవ గుమ్మడి కొట్టింది తామేనని స్పష్టంచేశారు. విద్యతోనే బీసీలకు అందలమని నమ్మిన ప్రభుత్వం తమదని, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ గురుకులాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ గురుకులాల్లో నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, రక్షణ కల్పిస్తూ బీసీలు ఉన్నత విద్య చదివే ప్రోత్సహిస్తున్నామన్నారు.
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో ఆదివారం మహ్మత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నామన్నారు. విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. తల్లికి వందనం పథకం పేరుతో ఇంట్లో ఎందరు బిడ్దలు ఉంటే, అందరికీ రూ.13 వేల చొప్పున అందజేశామన్నారు. విద్యా మిత్ర కిట్లు అందజేస్తున్నామన్నారు.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో కొత్తగా పది మహత్మాజ్యోతిరావు బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించామన్నారు. ఇందులో భాగంగా పెనుకొండ పట్టణంలో బీసీ గురుకుల బాలుర పాఠశాలను ప్రారంభించామన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 5 నుంచి 8వ తరగతి వరకూ 250 సీట్లు భర్తీచేసేలా అడ్మిషన్లు చేపట్టామన్నారు. ఈ ఏడాది ఆరు బీసీ గురుకులాలను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేశామని మంత్రి సవిత తెలిపారు.
త్వరలో ఎస్సీ గురుకులం ఏర్పాటు
పెనుకొండ నియోజక వర్గంలో పలు గురుకులాలు, బీసీ హాస్టళ్ల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని మంత్రి సవిత తెలిపారు. రూ.3 కోట్లతో కేజీవీబీ పాఠశాలను, రొద్దం, గోరంట్ల, సోమందేపల్లి లో బీసీ హాస్టళ్లను ప్రారంభించామన్నారు. త్వరలో పెనుకొండలో ఎస్సీ గురుకుల పాఠశాలలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బీసీ గురుకులాల్లో విద్యార్థులకు విద్యతో క్రీడల్లోనూ ప్రోత్సహించేలా స్పోర్ట్స్ ట్రాక్ షూట్లు, బూట్లు అందజేశామన్నారు.
త్వరలో స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందజేసే సౌకర్యాలను వినియోగించుకుంటూ, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టేలా కష్టపడి చదవాలని విద్యార్థులకు సూచించారు. ఎంజేపీ గురుకుల పాఠశాలల సీట్ల కోసం విపరీతమైన డిమాండ్ ఉందని, ఫలితాల్లో కూడా ఈ పాఠశాలలు అగ్రస్థానంలో నిలుస్తున్నాయని మంత్రి సవిత కొనియాడారు.
క్రెడిట్ చోరీలకు కేరాఫ్ అడ్రాస్ జగన్...
అనంతరం మంత్రి సవిత విలేకరులతో మాట్లాడుతూ, ప్రాణాలు కోల్పోయిన బాధితులను కాకుండా, వారిని పొట్టనపెట్టుకున్న హంతుకులను పరామర్శించే క్రెడిట్ జగన్ సొంతమని విరుచుకుపడ్డారు. పేదల కడుపునింపే అన్న క్యాంటీన్లను మూసివేసిన క్రెడిట్ కూడా ఆయన సొంతేమనన్నారు. రప్పా రప్పా నరకడం వైసీపీ క్రెడిట్ అని, అమరావతిని పక్కనపెట్టేసి, రాజధానిని మూడు ముక్కల చేసిన క్రెడిట్ కూడా వారిదేనన్నారు.
అయిదేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సంచితో సిమెంట్ కూడా వేయని జగన్ క్రెడిట్ తమకు అవసరమా..? అని ప్రశ్నించారు. జగన్ దౌర్భాగ్యపు క్రెడిట్లు తమకు వద్దని, కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి క్రెడిట్ అని మంత్రి స్పష్టంచేశారు. క్రెడిట్ చోరీలకు కేరాఫ్ అడ్రాస్ జగన్ అని మండిపడ్డారు. భోగాపురం ఎయిర్ నిర్మాణానికి టెంకాయ కొట్టింది తామేనని, ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవ సందర్భంగా గుమ్మడి కొట్టింది కూడా తామేనని తెలిపారు.
భోగాపురం ఎయిర్ పోర్టు క్రెడిట్ ముమ్మాటికీ తమదేనని మంత్రి సవిత స్పష్టంచేశారు. ఉత్తరాంధ్ర వాసుల ఆకాంక్షను సీఎం చంద్రబాబు నెరవేర్చారన్నారు. ఈ కార్యక్రమంలో పలు కార్పొరేషన్ చైర్మన్లు వెంకట రమణ, స్వప్న, ఆర్డీవో ఆనందరావు కార్పొరేషన్ డైరెక్టర్ లు, కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.




