Puttaparthi: పుట్టపర్తిలో రైతు బజార్ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్!

Puttaparthi: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రైతు బజార్ నిర్మాణ పనులను పరిశీలించి, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్.

S.Firoz, Sri Sathya Sai
Published on: 10 Nov 2026 3:01 PM IST
Puttaparthi
X

Puttaparthi: పుట్టపర్తిలో రైతు బజార్ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్!

Puttaparthi: శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలోని కర్ణాటకనాగేపల్లిలో నిర్మిస్తున్న నూతన రైతు బజార్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులు, వినియోగదారులకు అన్ని సౌకర్యాలతో రైతు బజార్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

రైతు బజార్‌లోని బోరుబావిలో ఇసుక పూడిక చేరడంతో మోటార్ పనిచేయడం లేదని గుర్తించిన కలెక్టర్, మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో తక్షణమే రెండు నుంచి మూడు తాగునీటి కనెక్షన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో భూగర్భ నీటి సంపు నిర్మించి, మున్సిపల్ శాఖ నిర్మిస్తున్న మరుగుదొడ్లపై ఏర్పాటు చేసే ఓవర్‌హెడ్ ట్యాంకుకు నిరంతర నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే రైతు బజార్ ఆవరణలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, ప్రతి షెడ్డు మధ్యలో ప్రజల రాకపోకలకు అనుకూలంగా పేవర్ రాళ్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

అర్ధాంతరంగా నిలిచిపోయిన సెమీ స్ట్రక్చర్ ప్లాట్‌ఫారమ్‌లను ఇసుకతో నింపి, లెవలింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఇరిగేషన్ డీఈ, సాంకేతిక అధికారులకు సూచించారు. రైతు బజార్ నిర్మాణానికి సంబంధించిన అన్ని పనులను సకాలంలో పూర్తి చేసేందుకు మార్కెటింగ్, మున్సిపల్, ఇరిగేషన్, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ ఏడీ హాఫిజుల్లా, మున్సిపల్ అధికారులు, ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు, విద్యుత్ శాఖ అధికారులు, ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ విరాజీవ్ తదితరులు పాల్గొన్నారు.

S.Firoz, Sri Sathya Sai

S.Firoz, Sri Sathya Sai