Puttaparthi: ఇళ్లకు తాళం వేసి వెళ్తే పోలీసులదే రక్షణ!

Puttaparthi: పుట్టపర్తిలో ఇంటి చోరీల నివారణే లక్ష్యంగా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, అడిషనల్ ఎస్పీ అంకిత సురానాతో కలిసి 'LHMS' వ్యవస్థను ప్రారంభించారు.

SHAIKH FIROZ, PUTTAPARTHI
Published on: 29 Jun 2026 5:34 PM IST
Puttaparthi
X

Puttaparthi: ఇళ్లకు తాళం వేసి వెళ్తే పోలీసులదే రక్షణ!

పుట్టపర్తి: నేరం జరిగిన తర్వాత చర్యల కంటే, నేరం జరగకుండా ముందస్తు నివారణే పోలీసుల లక్ష్యం అని ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ పేర్కొన్నారు. పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (LHMS) ను అడిషనల్ ఎస్పీ అంకిత సురాన తో కలిసి ప్రారంభించారు. జిల్లాలో ఇంటి చోరీలను అరికట్టడం, ప్రజల ఆస్తులకు మెరుగైన రక్షణ కల్పించడం ఈ వినూత్న వ్యవస్థ ప్రధాన ఉద్దేశమని ఎస్పీ తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..

ప్రస్తుతం నేరస్థులు తాళం వేసి ఉన్న ఇళ్లను కొంతకాలం గమనించి, ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత చోరీలకు పాల్పడుతున్నారని తెలిపారు. సెలవులు, పండుగలు, శుభకార్యాలు లేదా ఇతర కారణాలతో కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ప్రజలు బంగారం, నగదు ఇతర విలువైన వస్తువులను ఇళ్లలో కాకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించారు.

చోరీ జరిగిన తర్వాత నిందితులను పట్టుకోవడం కంటే, అసలు చోరీకి అవకాశం లేకుండా ముందుగానే చర్యలు తీసుకోవడం అత్యంత ప్రభావవంతమైన మార్గమని వివరించారు. ఇటీవలి కాలంలో చిన్న వయస్సు వారూ చోరీలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని, నిందితులను అరెస్ట్ చేసినప్పటికీ దొంగిలించిన ఆస్తులు తాకట్టు పెట్టడం లేదా విక్రయించడం వల్ల బాధితులకు పూర్తిస్థాయి ఉపశమనం కల్పించడం కష్టతరమవుతోందని చెప్పారు.

అందువల్ల ముందస్తు భద్రతా చర్యలే ఉత్తమ పరిష్కారమని స్పష్టం చేశారు.

LHMS సేవల వినియోగ విధానం..

ప్రజలు గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న LHMS యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పేరు, చిరునామా, మొబైల్ నంబర్ వంటి వివరాలతో నమోదు చేసుకోవాలి. ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే ముందు కనీసం ఒక రోజు ముందుగానే యాప్ ద్వారా సమాచారాన్ని నమోదు చేయాలి. ఆ సమాచారం జిల్లా పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు చేరి, అక్కడి నుంచి సంబంధిత పోలీస్ స్టేషన్‌కు పంపబడుతుంది.

అనంతరం పోలీసు సిబ్బంది ఇంటి వద్దకు వెళ్లి మోషన్ సెన్సార్ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అనుమానాస్పద కదలికలు గుర్తించిన వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అలర్ట్ చేరుతుంది. సమాచారం అందిన వెంటనే సమీపంలోని పెట్రోలింగ్ బృందాలను అప్రమత్తం చేసి, అత్యంత వేగంగా సంఘటనా స్థలానికి పంపించేలా చర్యలు తీసుకుంటారు.

ఈ విధానం ద్వారా చోరీ ప్రయత్నాలను ప్రారంభ దశలోనే గుర్తించి అడ్డుకునే అవకాశం ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఈ సేవ కోసం ప్రజలు ప్రత్యేకంగా ఎలాంటి సాంకేతిక పరికరాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇంట్లో వై-ఫై సదుపాయం ఉన్నా లేకపోయినా అవసరమైన ఏర్పాట్లను పోలీసు శాఖే చేపడుతుందని వివరించారు.

అలాగే ప్రతి ఇంటి వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా భద్రతను మరింత బలోపేతం చేసుకోవచ్చని సూచించారు. ప్రజల సహకారంతో జిల్లాలో ఇంటి చోరీలను గణనీయంగా తగ్గించడమే శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ శాఖ లక్ష్యమని ఎస్పీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురాన, ఐపీఎస్, డీటీఆర్‌బీ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి, సీఐ బొజ్జప్ప, ఆర్‌ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, వీరన్న, ప్రసాద్, ఐటీ కోర్ట్ ఇన్‌చార్జ్ సుదర్శన్ రెడ్డి, పోలీసు సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.

SHAIKH FIROZ, PUTTAPARTHI

SHAIKH FIROZ, PUTTAPARTHI

Next Story