Raptadu: పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమిదే విజయం
Raptadu: రామగిరి వెంకటాపురంలో పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ మీడియా సమావేశం; పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి విజయం తథ్యమని, బీసీలకు 40 శాతం సీట్లని ధీమా.
Raptadu: పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమిదే విజయం
రాప్తాడు: అప్పుడు ఈవీఎంలంటూ విమర్శలు చేశారు.. ఇప్పుడు బ్యాలెట్తోనూ ప్రజలు సమాధానం చెప్పారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, శ్రీ సత్యసాయి జిల్లా జడ్పీ చైర్మన్ పరిటాల శ్రీరామ్ అన్నారు.రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.రామగిరి మండలం వెంకటాపురంలోని తమ నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ మాట్లాడారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా కూటమికి ప్రజలు అఖండ విజయాన్ని అందించారని, ఇటీవల జరిగిన మున్సిపల్, కార్పొరేషన్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా కూడా కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపారని పరిటాల సునీత అన్నారు.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో దాడులు, దౌర్జన్యాలు, రిగ్గింగ్ జరిగాయని ఆమె ఆరోపించారు.
కూటమి ప్రభుత్వంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. రాప్తాడు నియోజకవర్గంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు సాధించిన విజయాలు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు.నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఆదరిస్తున్నారని, రాబోయే పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రతి పంచాయతీలో కూటమి అభ్యర్థులను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
బీసీలకు గత వైసీపీ ప్రభుత్వం రిజర్వేషన్లు తగ్గించడం వల్ల సుమారు 16,800 మంది రాజకీయ ప్రాతినిధ్యం కోల్పోయారని విమర్శించారు.కూటమి ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నించగా, వైసీపీ నేతలు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారని ఆరోపించారు.అయినప్పటికీ పార్టీ పరంగా 40 శాతం రిజర్వేషన్లు కల్పించి బీసీలకు ప్రాధాన్యత ఇచ్చామని స్పష్టం చేశారు.
ఇక జడ్పీ చైర్మన్ పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ.. ధర్మవరం మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో పాటు నాలుగు ఎంపీపీ స్థానాలు, ధర్మవరం రూరల్, బత్తలపల్లి జెడ్పీటీసీ స్థానాల్లో సాధించిన విజయాలు కార్యకర్తల సమష్టి కృషికి నిదర్శనమన్నారు.శ్రీ సత్యసాయి జిల్లా తొలి జడ్పీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టడం తనపై మరింత బాధ్యతను పెంచిందని, జిల్లాలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్థానిక సంస్థలు సమన్వయంతో పనిచేసే ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఎంతో అవసరమని అన్నారు. దీనివల్ల నిధుల కేటాయింపు, మౌలిక వసతుల కల్పన వేగవంతం అవుతాయని వివరించారు.
అర్హులైన పేద కుటుంబాలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పీ4 విధానం ఉపయోగకరంగా ఉందన్నారు.తుఫానుల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వ యంత్రాంగం వేగంగా స్పందించి ప్రజలను ఆదుకుందని పేర్కొన్నారు.టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఇదే ఐక్యతతో ముందుకు సాగి రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ పిలుపునిచ్చారు.రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల పరిధిలోని ప్రతి గ్రామ అభివృద్ధికి తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు.




