Rayadurgam: పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు
Rayadurgam: రాయదుర్గం నియోజకవర్గంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు భూమిపూజ చేశారు. ప్రజా దర్బార్ నిర్వహించి వినతులు స్వీకరించారు.
Rayadurgam: పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు
రాయదుర్గం: ప్రతి గ్రామం స్వయం సమృద్ధి సాధించాలన్న మహాత్మాగాంధీ కలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాకారం చేస్తున్నారని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. డి.హీరేహాల్ మండలం ఎం.హనుమాపురం, దొడగట్ట గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన పల్లె పండుగ–3.0 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గ్రామంలో రోడ్డు పనులకు భూమిపూజ చేశారు.
అనంతరం ప్రజా దర్బార్ నిర్వహించి గ్రామస్తుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నిరంతర కృషి, దూరదృష్టితో రాష్ట్రంలోని గ్రామాలు స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయన్నారు. ప్రతి గ్రామం తనకు అవసరమైన వస్తువులు, వసతులను సాధ్యమైనంత వరకు స్థానికంగానే సమకూర్చుకుని అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందన్నారు.
గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రం నుంచి అధిక నిధులు తీసుకువచ్చి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేశారని తెలిపారు. అదే విధంగా పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ కూడా కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో నిధులు సమీకరించి గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో సిమెంట్, తారు రోడ్లు, గోకులం షెడ్లు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, ఇతర మౌలిక వసతుల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాయదుర్గం నియోజకవర్గంలో ఇప్పటివరకు సుమారు రూ.90 కోట్లతో సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు తదితర అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు.
పల్లె పండుగ పేరుతో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపడటంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయన్నారు. గ్రామాల్లో రోడ్లు, ఆరోగ్య సదుపాయాలు, ఇతర మౌలిక వసతులు అందుబాటులోకి రావడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవటంతో పాటు ఆదాయ అవకాశాలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు.
ఎం.హనుమాపురం గ్రామస్తులు కూడా గ్రామానికి అవసరమైన వసతులు, సౌకర్యాల గురించే తన దృష్టికి తీసుకువస్తున్నారని, వ్యక్తిగత సమస్యల కంటే గ్రామాభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే ప్రశంసించారు. గ్రామానికి సంబంధించిన అవసరాలను తన దృష్టికి తీసుకువచ్చినప్పుడు కాదనకుండా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానన్నారు.
ఇప్పటికే గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే తన ప్రధాన లక్ష్యమని, గ్రామస్తుల ఆదరణ, ఆశీస్సులే తనకు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. గ్రామస్తుల సమస్యలను పరిష్కరించేందుకు, గ్రామాల అభివృద్ధికి ఎల్లప్పుడూ పెద్దకొడుకులా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రజల అవసరాల కోసం నిరంతరం పనిచేస్తూ, నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు.




