మూడో రోజుకు చేరిన సమ్మె: సత్యసాయి తాగునీటి పథక కార్మికుల నిరసన.. ఏఐటీయూసీ మద్దతు

సత్యసాయి తాగునీటి పథకం కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరింది. 2026 బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని, 536 మంది కార్మికుల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని ఏఐటీయూసీ నేత ఆంజనేయులు ఆరోపించారు.

S.Firoz, Sri Sathya Sai
Published on: 7 May 2026 7:40 PM IST
మూడో రోజుకు చేరిన సమ్మె: సత్యసాయి తాగునీటి పథక కార్మికుల నిరసన.. ఏఐటీయూసీ మద్దతు
X

కొత్తచెరువు: సత్యసాయి జిల్లాలో పనిచేస్తున్న సత్యసాయి తాగునీటి పథక కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు ఆరోపించారు. కొత్తచెరువు పట్టణంలోని సత్యసాయి పంప్ హౌస్ దగ్గర సత్యసాయి కార్మికులు మూడో రోజు సమ్మె సందర్భంగా వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా ఉమ్మడి జిల్లాలకు సత్యసాయి మంచినీటి పథకం ద్వారా వందలాది గ్రామాల ప్రజలకు దాహార్తి తీరుస్తున్న సత్యసాయి మంచినీటి పథకాన్ని నిర్లక్ష్యం చేయడం తగదని అన్నారు.

ఈ పథకంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 536 మంది కార్మికుల పని చేస్తున్నారని నిత్యం గ్రామాలకు ఈ పథకం ద్వారా ఎన్ని ఇబ్బందులు ఉన్నా నీటి సరఫరా జరుగుతుందని అలాంటి ఈ పథకాన్ని నీరుగార్చే పద్ధతుల్లో ప్రభుత్వం వివరిస్తుందని 2026 బడ్జెట్లో ఈ పథకానికి సంబంధించి ఏమాత్రం కూడా నిధులు కేటాయించలేదని, ప్రతి సంవత్సరం ఈ పథకం కు ఏడాదికి 30 కోట్ల రూపాయలు కేటాయించే వారని, ఈ సంవత్సరం జెడ్పీ నుంచి నిధులు తీసుకోవాలని చెప్పడం చూస్తుంటే ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం పూనుకుందని ఆరోపించారు. ఇప్పటికైనా ఈ పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించి కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ ప్రాంతీయ కార్యదర్శి వినోద్ కుమార్, సత్యసాయి తాగునీటి పథక కార్మిక సంఘం నాయకులు రాము, నాగేంద్ర రెడ్డి, నరేష్, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

S.Firoz, Sri Sathya Sai

S.Firoz, Sri Sathya Sai

Next Story