Somandepalli: సోమందేపల్లిలో ఘనంగా 'అంగన్ కా ఉత్సవ్' హాజరైన మంత్రి సవిత
Somandepalli: సోమందేపల్లిలో ఘనంగా అంగన్ కా ఉత్సవ్. గర్భిణులకు శ్రీమంతం, చిన్నారులకు అన్నప్రాసన చేసిన మంత్రి సవిత. కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు పెద్దపీట.
Somandepalli: సోమందేపల్లిలో ఘనంగా 'అంగన్ కా ఉత్సవ్' హాజరైన మంత్రి సవిత
సోమందేపల్లి: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని, ప్రజాసేవలో ఆయన 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సేవా సంకల్ప్ అభియాన్ – ఆంగన్ కా ఉత్సవ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
పోషణ మాసం కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి శ్రీమతి సవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి సవిత గర్భిణులకు పసుపు–కుంకుమతో సామూహిక శ్రీమంతం నిర్వహించి, తల్లులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చిన్నారులకు
అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులు, తల్లులతో మమేకమైన మంత్రి అంగన్వాడీ కేంద్రంలో అందుతున్న సేవలను స్వయంగా పరిశీలించారు. పిల్లలకు అందుతున్న పోషకాహారం, ప్రాథమిక విద్య, ఆరోగ్య సేవలను పరిశీలించిన మంత్రి.. గర్భిణీలు, బాలింతలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మహిళలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ..గర్భంలో బిడ్డ పడిన నాటి నుంచి ఐదేళ్ల వయస్సు వచ్చే వరకు తల్లులు, చిన్నారుల సంక్షేమానికి ఐసీడీఎస్ శాఖ అండగా నిలుస్తోందని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలు కేవలం ఆహారం అందించే కేంద్రాలు మాత్రమే కాదని, పిల్లల ఆరోగ్యం, పోషణ, ప్రాథమిక విద్య, మానసిక–శారీరక అభివృద్ధికి పునాది వేసే కేంద్రాలని పేర్కొన్నారు.
అంగన్వాడీ ఉద్యోగులను గుర్తించి వారి సంక్షేమానికి చర్యలు తీసుకున్నది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమేనని మంత్రి తెలిపారు. అంగన్వాడీ టీచర్ల జీతాలను రూ.4,200 నుంచి రూ.6,000కు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని చెప్పారు. ప్రస్తుతం అంగన్వాడీ సిబ్బందికి రూ.12 వేల జీతం అందిస్తున్నామని తెలిపారు. అంగన్వాడీ సిబ్బందికి కూడా అమ్మ ఒడి పథకం ప్రయోజనం అందేలా మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని పేర్కొన్నారు.
అదేవిధంగా అంగన్వాడీ సిబ్బందికి సెలవు దినాలను పెంచినట్లు తెలిపారు.మన అంగన్వాడీ మన బాధ్యత.. మన పిల్లల ఆరోగ్యం – మనందరి బాధ్యత అనే సందేశంతో ప్రతి కుటుంబం అంగన్వాడీ కేంద్రాల సేవల్లో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి తల్లి, ప్రతి చిన్నారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు, అంగన్వాడీ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
అంగన్వాడీ సిబ్బందికి ఘన సన్మానం
కార్యక్రమంలో భాగంగా సోమందేపల్లి మండల వ్యాప్తంగా సేవలందిస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలను మంత్రి సవిత ఘనంగా సన్మానించారు. చిన్నారులు, తల్లుల సంక్షేమం కోసం అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న సేవలను మంత్రి అభినందించారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి కుటుంబానికి చేరువ చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అంగన్వాడీ సీడీపీఓ, సూపర్వైజర్, మండల అధికారులు, గ్రామ సచివాలయ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, కూటమి నాయకులు, మహిళా నాయకులు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.




